Tammineni Sitaram: ఏపీలో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక కామెంట్లు చేశారు. రాజధాని వికేంద్రీకరణపై స్పష్టమైన తీర్పు వచ్చిందని.. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతున్న తరుణంలో ఈ తీర్పు మళ్లీ న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగేలా చేసిందని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. హైకోర్టును మీరు ప్రభుత్వమా.. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లా అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం గమనించాల్సిన విషయం అని పేర్కొన్నారు. భారతీయ రాజ్యాంగం చాలా గొప్పదని.. శాసన, న్యాయ, కార్యనిర్వాహక సంస్థలకు దేనికదే ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారని తమ్మినేని అన్నారు. రాజ్యాంగంలో లక్మణరేఖలు ఉన్నాయని.. వాటిని లైన్ క్రాస్ చేయటానికి వీలులేదని స్పష్టం చేశారు. ఒక వ్యవస్థను మరో వ్యవస్థ గౌరవించుకోవాలని సూచించారు.
Read Also: Monkeypox: మంకీపాక్స్‌కు కొత్త పేరు.. ఏమిటో తెలుసా?
తామే గొప్ప అనుకుంటే ప్రజలలో పలుచన అవుతామని తమ్మినేని సీతారాం అన్నారు. గోలక్‌నాథ్ కేస్, కేశవానంద భారతి, మినర్వా మిల్స్ కేసుల్లో చారిత్రాత్మక తీర్పులు వచ్చిన సంగతి మరిచిపోరాదన్నారు. మూడు రాజధానుల కేసు సందర్భంగా హైకోర్టు ఓవర్ ల్యాప్ అయ్యిందన్నారు. న్యాయవ్యవస్థపై సంపూర్ణ గౌరవం శాసన వ్యవస్థకు ఉందని తెలిపారు. ప్రభుత్వ విధులు హైకోర్టు చేస్తుంది కాబట్టే తాము సుప్రీంకోర్టుకు వెళ్లా్ల్సి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రాజ్యాంగానికి కట్టుబడి పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఆరుమాసాలలో ఒక ఇల్లు కూడా కట్టలేమని.. అలాంటిది రాజధాని ఎలా కడతారని ప్రశ్నించారు. ఈ తీర్పును చూసి ప్రజలు నవ్విపోయారన్నారు. శాసనసభ చట్టం చేయకూడదంటే ఎలా అని నిలదీశారు. శాసనసభలో కూడా తమ హక్కుల గురించే మాట్లాడామని.. ఇక్కడి న్యాయవ్యవస్థ మాటలకు బాధపడ్డామన్నారు. వికేంద్రీకరణపై యాగీ చేస్తున్న జనసేన, టీడీపీ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై క్లారిటీ ఇవ్వాలన్నారు.
Read Also: Muslim weddings: వివాహాల్లో డ్యాన్సులు, మ్యూజిక్‌ను నిషేధించిన ముస్లిం మతపెద్దలు.. ఎక్కడంటే?
రైతుల పేరుతో బినామీ యాత్రలు చేసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవిధంగా చేస్తున్నారని తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తామన్న చంద్రబాబుది పొలిటికల్ డ్రమిటిక్ షో అని ఎద్దేవా చేశారు. రాజధాని అనేది మూడు ప్రాంతాల మనోభావాలకు సంబంధించిందని పేర్కొన్నారు. తన బినామీలతో భూములు కొనిపించి రేట్లు పెంచుకునే ప్రక్రియ చేపట్టారని.. హైకోర్టు తన పరిధి దాటిందని తాము ఆరోజే చెప్పామన్నారు. మనమంతా సర్వోన్నత న్యాయస్థానానికి లోబడి ఉండాలన్నారు. ఎవరి పని వారు చేస్తే మంచిదని.. లేకపోతే వ్యవస్థలో అరాచకం వస్తుందన్నారు. న్యాయ వ్యవస్థ విశ్వసనీయత గురించి తాము ప్రశ్నించడం లేదని.. తమకు న్యాయ వ్యవస్థపై గౌరవం ఉందన్నారు. అమరావతి ఓ భ్రమరావతి అని స్పీకర్ తమ్మినేని ఆరోపించారు.