ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సెక్రటరీ చేతుల మీదుగా డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, కృష్ణయ్య, బీద మస్తాన్ రావు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని తిరిగి రెండోసారి ఎంపికచేశారు సీఎం జగన్. అలాగే బీసీ వర్గానికి చెందిన ఆర్.కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావు, సుప్రీంకోర్టులో న్యాయవాది ఎస్,నిరంజన్‌రెడ్డిలకు జగన్ అవకాశం ఇచ్చారు. వీరిలో ఇద్దరు రాష్ట్రానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం.
తాను తెలంగాణలోనే పోరాడలేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న బీసీల అభివృద్ధి కోసం పని చేస్తున్నానని రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య అంటున్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలంటే తెలంగాణకే కాకుండా దేశంలో అందరి కోసం రిజర్వేషన్లు ఉండాలన్నారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని రాజ్యసభలో కొట్లాడతానని చెప్పారు.
బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్‌బోన్‌క్లాస్ అని నమ్మిన సీఎం ఆచరణలో చేసి చూపించారు. బీసీల సమస్యలపై జీవితమంతా ఆర్ కృష్ణయ్య పోరాటం చేశారని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. రెండవసారి తనకు అవకాశం ఇచ్చిన జగన్ కి ధన్యవాదాలు తెలిపారు విజయసాయిరెడ్డి. వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయికి రెండవసారి అవకాశం ఇస్తారని ముందునుంచే అంతా భావించారు. కానీ ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలకు అవకాశం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముందునుంచీ తనతో సన్నిహితంగా మెలిగిన నటుడు అలీకి అవకాశం ఇస్తారని భావించారు. కానీ అలా జరగలేదు.
అలీకి నామినేటెడ్ పదవిని కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి సైతం సీఎం అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె అసహనంతో వున్నారు. గతంలో రిలయెన్స్ నుంచి పరిమళ్ నత్వానికి అవకాశం ఇచ్చినట్టు ఈసారి అదానీ కుటుంబీకులకు పదవి కట్టబెడతారని భావించారంతా. కానీ అలా జరగలేదు. మొత్తం మీద ఈసారి రాజ్యసభ ఎన్నికలు ఊహించిన దానికంటే భిన్నంగా జరిగాయి. నలుగురు సభ్యుల ఎంపికతో రాజ్యసభలో వైసీపీ సభ్యుల బలం పెరిగింది.
Ap Rajyasabha: బలహీనవర్గాలకు సీఎం జగన్ పెద్ద పీట