రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సి రావటం బాధాకరంగా ఉందని మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యానించారు. శనివారం అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలపై ఛార్జీల భారం మోపడం బాధగానే ఉన్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో అనివార్యంగా ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే ఆర్టీసీ బస్సు ఛార్జీలు తక్కువగా ఉన్నాయని మంత్రి విశ్వరూప్ వెల్లడించారు.
ప్రస్తుతం డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న కారణంగా ధరల భారం మోపాల్సి వస్తోందని.. డీజిల్ ధర తగ్గగానే సెస్ తగ్గించేందుకు ప్రయత్నిస్తానని మంత్రి విశ్వరూప్ తెలిపారు. తిరుమలకు దశలవారీగా 100 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఆర్టీసీని ప్రభుత్వం చేశామని మంత్రి విశ్వరూప్ గుర్తు చేశారు. కాగా ఏపీలోని పల్లెవెలుగు బస్సుల్లో ఇప్పటిదాకా రూ.8 ఉన్న కనీస ఛార్జీని రూ.10 పెంచిన ఆర్టీసీ.. రూ.2 డీజిల్ సెస్, రూ.1 సేఫ్టీ సెస్ విధించింది. ఇవన్నీ కలిపితే కనీస టికెట్ ధర రూ.13 అవుతుండగా.. చిల్లర సమస్య రాకుండా కనీస ఛార్జీని రూ.15గా సవరించింది.