చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు మాత్రమే ప్రయోజనం చేసే ప్రయత్నం చేశారు.. కానీ, వైఎస్ జగన్ సర్కార్ హయాంలో పరిస్థితి మారిపోయిందన్నారు ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ 26 నెలల కాలంలో బీసీలు బ్యాక్‌వర్డ్ క్లాస్ స్థాయి నుంచి బ్యాక్ బోన్ క్లాస్ స్థాయికి ఎదిగారని అభివర్ణించారు. ఈ రెండేళ్ల కాలంలో సుమారుగా 69 వేల కోట్ల రూపాయల ప్రయోజనం బీసీలకు చేకూరిందన్న ఆయన.. మొత్తం సంక్షేమ పథకాల్లో ఇది సుమారుగా 49 శాతంగా వెల్లడించారు మంత్రి. టీడీపీ హయాంలో టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు మాత్రమే ప్రయోజనం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించిన ఆయన.. పైగా బీసీలకు రుణం, పెన్షన్, ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సి వచ్చేదన్నారు.. ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి వేణుగోపాల్.