సీఆర్డీఏ చట్టం, మూడు రాజధానుల పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తుది తీర్పు వెలువరించింది.. అయితే, హైకోర్టు తీర్పుపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్… హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలి? సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలా? వద్దా? అనే విషయాలపై సమాలోచనలు చేశారు.. అయితే, ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేవారు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లాలా..? లేదా..? అని ఆలోచన చేస్తామన్న ఆయన.. అయినా అప్పీలుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించారు.. మూడు రాజధానులకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.. రాజధాని అభివృద్ది అంశం సమయం, ఖర్చు, నిధులతో ముడిపడి ఉన్నాయని.. అభివృద్ధి విషయంలో వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటాం అన్నారు.. ప్రస్తుతం సీఆర్డీఏ చట్టం అమల్లో ఉందన్న బొత్స.. దీనిని, డీవియేషన్ చేసి ఎలా ముందుకు వెళ్తాం అని.. రాజధానిపై మా విధానం మాకు ఉందని స్పష్టం చేశారు.
Read Also: Russia Ukraine War: రష్యాకు బిగ్ షాక్.. మేజర్ జనరల్ హతం
అభివృద్ధి అనేది వ్యక్తుల కోసం కాదు.. వ్యవస్థ కోసం చేయాలి అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. రాజధానిలో డెవలప్‌మెంట్ చేస్తున్నాం.. ఎక్కడా డీవియేట్ కావడం లేదన్నారు.. అభివృద్ధి వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం.. దానికి కట్టుబడి ఉన్నాం అన్నారు.. రైతులకు చేయాల్సినవన్నీ చేస్తున్నాం.. రైతులకు సీఎం ఎందుకు క్షమాపణ చెప్పాలి? అని నిలదీశారు బొత్స… మేం ఎక్కడా రాజధాని భూములను ఇతర అవసరాల కోసం ఎక్కడా తనాఖా పెట్టలేదని స్పష్టం చేసిన మంత్రి.. రాజధాని అభివృద్ది కోసమే రాజధానిలోని భూములను హడ్కోకు తాకట్టు పెట్టారని.. రాజధాని భూములను చంద్రబాబు హయాంలోనే తనాఖా పెట్టారన్నారు. ఇక, శాసనసభ సమావేశాల్లో బిల్లు పెడతామో లేదో అనేది మీరే చూస్తారుగా అన్నారు బొత్స.. రాజధానిపై చట్ట పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అన్నారు.. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని పార్లమెంటులో చెప్పారని గుర్తుచేశారు బొత్స. దీనికి విరుద్ధంగా తీర్పు వచ్చింది.. దీనిపై విస్తృత చర్చ జరగాలన్నారు.. దీనిపై న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న ఆయన.. అడ్డంకులు తొలగించుకుని అందరికీ ఆమోదయోగ్యంగా బిల్లు తెస్తాం అన్నారు.. రాజధాని అంటే ప్రజలు.. ఓ సామాజిక వర్గం కాదు.. అందరికీ ఆమోద యోగ్యం అయ్యేలా రాజధాని ఉండాలన్నారు.. రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రమే చెప్పిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.