AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33గా గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఇటీవల, అరెస్ట్ అయిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్యాల రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ చేర్చింది. ఈ ముగ్గురి ఆదేశాలతోనే అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల దగ్గరకు చేరాయని విచారణలో తెలిపారు నిందితులు. ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగానే వీళ్ల పేర్లు చేర్చినట్లు మెమోలో సిట్ పేర్కొంది.
Read Also: MP Imran Masood: ‘‘మూడు కాకుల్ని చంపారు’’.. “సర్జికల్ స్ట్రైక్స్”పై మరో కాంగ్రెస్ నేత..
ఈ నేపథ్యంలోనే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని సోమవారం నాడు సుప్రీం కోర్టుకు ఈ ముగ్గురు వెళ్లారు. కానీ, వీరికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏపీ హైకోర్టులోనే ఈ కేసును తేల్చుకోవాలని స్పష్టం చేసింది. కాగా, ఏపీ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు గోవిందప్ప పిటిషన్ దాఖలు చేయగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఈ ముగ్గురు పేర్లను ఈ కేసులో చేర్చుతూ సిట్ మెమో దాఖలు చేసింది. ఈ మెమోను న్యాయస్థానం తమ పరిగణలోకి తీసుకుంటే.. ఈ ముగ్గురిని ఏపీ లిక్కర్ కుంభకోణంలో నిందితులుగా చేర్చినట్టు అవుతుంది.