TDP MLCs want to discuss Jangareddygudem deaths in Andhra Pradesh Legislature.
పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఇటీవల చోటు చేసుకున్న మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. దీంతో శాసన మండలిలో జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలపై చర్చించాలంటూ టీడీపీ సభ్యుల ఆందోళనకు దిగారు. అయితే చర్చకు రెడీగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్మెంట్ ఇవ్వడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సిద్ధమయ్యారు.
దీంతో స్టేట్‌మెంట్ ముఖ్యమంత్రితో ఇప్పించాలని యనమల రామకృష్ణుడు పట్టుబట్టారు. నిన్న ముఖ్యమంత్రి స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చే స్టేట్‌మెంట్ పరిగణలోకి రాదని యనమల అన్నారు. యనమల వ్యాఖ్యలపై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభ్యంతరం తెలిపారు. రూల్ 306లో ఆ శాఖకు సంబంధించిన మంత్రి స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రూల్ పొజిషన్‌లో చదివి వినిపించారు. యనమల వ్యాఖ్యలు మండలి చైర్మన్‌ను అవమానించేలా ఉన్నాయని ఉమారెడ్డి మండిపడ్డారు.