ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని అన్ని జిల్లాల డిఎంహెచ్వో లతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కరోనా కేసులు అధికంగా ఉన్న కృష్ణా, గుంటూరు, విశాఖ, నెల్లూరు, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. రానున్న ఆరువారాల్లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించడంతో కేసులు ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. వైరస్ వ్యాప్తి గతానికంటే వేగంగా ఉందని, ఆసుపత్రుల్లో బెడ్స్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏలూరులో నిన్న ఒక్కసారి 40 కేసులు నమోదు కావడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు.