నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అవుతోంది. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. మద్యం శాంపిల్స్ పై కౌంటర్ ఇచ్చింది ప్రభుత్వం. పరీక్షలు చేసిన ఎస్‌జీఎస్ ల్యాబ్ ఇచ్చిన సమాధానం లేఖను మీడియాకు విడుదల చేశారు రజత్ భార్గవ.
ల్యాబ్ కు పంపించిన శాంపిల్స్ ఏపీ నుంచి సేకరించినవే అనడానికి ఆధారాలు లేవు. పరీక్ష చేయటానికి ఎక్సైజ్ చట్టం ప్రకారం అనుసరించాల్సిన ఏ నిబంధనను అనుసరించ లేదు. పరీక్ష చేయమన్న వాళ్ళు అడగక పోవటంతో శాంపిల్స్ ను ఐఎస్ నిబంధనల ప్రకారం చేయలేదని ఎస్‌జీఎస్ స్పష్టం చేసింది. ఇదంతా ఉద్దేశం పూర్వకంగా చేసిందే అని ఆయన అన్నారు. ఎంపీ రఘురామరాజు చెన్నైలోని ల్యాబ్‌కి పంపించటం వెనుక కారణం ఏంటో తెలియదు.
ఎస్‌జీఎస్ తమ లేఖలో శాంపిల్స్‌లో ఏ స్థాయిలో రసాయనాల ఆనవాళ్లు ఉన్నాయో పరీక్షించ లేదని పేర్కొన్నారు. తీసుకుని వచ్చిన శాంపిల్స్ హానికరం అని ఎస్‌జీఎస్ నివేదిక ఎక్కడా పేర్కొనలేదు. హైడ్రాక్సైడ్ ఉండటమే ప్రమాదకరం కాదు. కొన్ని హై రెసుల్యూషన్ పరీక్షల్లో మంచి నీళ్ళు కూడా తాగటానికి హానికరం అని వస్తాయి. ఎవరైనా పరీక్షలు చేయించవచ్చు…కానీ బీఎస్ఐ ప్రమాణాలకు అనుగుణంగా చేయించాలి. ప్రజల్ని తప్పు దారి పట్టించే వారిపై చర్యలు తీసుకుంటాం అని రజత్ భార్గవ స్పష్టం చేశారు.