శ్రీ వెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ వెబినార్ ద్వారా గవర్నర్ కీలకోపన్యాసం చేశారు. పురాతన జ్ఞాన సంపద వల్లే ప్రపంచ వేదికపై విశ్వగురుగా భారతదేశం నిలిచిందని ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు. గొప్ప వారసత్వం, సహజ వనరులు, సైనిక బలం ఫలితంగా భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్‌గా ఆవిర్భవించింది. భారతీయులు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. భారతీయ వేదాలు అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, సమానత్వం, సంపద సమ పంపిణీని ప్రబోధించాయి.
గతంలో భారతావని గణితం, జ్యోతిష్యం, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో ముందంజలో ఉండేదని గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ అన్నారు. అనేక శతాబ్దాల తర్వాత ఇప్పటికీ కౌశిక సూత్రం, వరాహమిహిరుని బృహత్ సంహిత, భరద్వాజ విమాన శాస్త్ర గ్రంథాలు మనకు గర్వకారణంగా నిలిచాయి. నాటి గ్రంథాలన్ని శాస్త్రీయ సూత్రాలతో నిండి ఉన్నాయని, వీటి ద్వారా భారతీయులే కాక, విదేశీ శాస్త్రవేత్తలు సైతం ప్రేరణ పొందారన్నారు. ప్రస్తుత పరిస్ధితులలో వేదాలకు సంబంధించిన సాహిత్యం ఔచిత్యాన్ని నొక్కిచెప్పాల్సిన అవసరం గవర్నర్ పేర్కొన్నారు.