విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతంలో బాక్సైట్ మైనింగుకు అవకాశం లేదని తేల్చి చెప్పిన ప్రభుత్వం.. రస్ అల్ ఖైమా సంస్థతో ఉన్న అంతర్జాతీయ ఒప్పందాలపై మధ్యవర్తిత్వం కోసమే అధికారుల కమిటీ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది సర్కార్. గతేడాది డిసెంబర్, ఈ ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన కమిటీలపై కొంత మంది దుష్ప్రచారం చేస్తోన్నారని వెల్లడించిన సర్కార్… గతంలో బాక్సైట్ మైనింగ్ కారణంగా ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రాణాలు కోల్పోయిన విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందని తెలిపింది. బాక్సైట్ మైనింగ్ సహా ఎలాంటి మైనింగుకూ అవకాశం ఇచ్చేది లేదని స్పష్టం చేస్తూ తాజాగా మరో జీవో జారీ చేసింది ప్రభుత్వం. లేటరైట్ తవ్వకాల పేరుతో మైనింగ్ చేస్తున్నారని గతంలో ఆరోపణలు రావడంతో సర్కార్ స్పష్టత ఇచ్చింది.