ఏపీలో పీఆర్సీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. నూతన పీఆర్సీ జీవోలను సోమవారం రాత్రి ప్రభుత్వం విడుదల చేయగా అందులోని పలు అంశాలను ఉద్యోగులను కలవరపరిచాయి. ముఖ్యంగా హెచ్ఆర్ఏను 30 శాతం నుంచి 16 శాతానికి తగ్గించడంతో ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పీఆర్సీ తమకు అక్కర్లేదని… పాత పీఆర్సీనే కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఉద్యోగులకు ఇచ్చే హెచ్ఆర్‌ఏ తగ్గించి కేంద్ర ప్రభుత్వ నిబంధనలను జీవోలలో పేర్కొన్నారని.. ఈ జీవోలను తాము తిరస్కరిస్తున్నామని స్పష్టం చేశారు.
తక్షణమే ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ప్రభుత్వ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అందరూ రేపటి నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతామన్నారు. అధికారులు ఇచ్చే నివేదిక తమకు అవసరం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని ఇటీవల కాగ్ నివేదిక వెల్లడించిందని.. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి కూడా చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. పక్క రాష్ట్రం కంటే ఏపీకి ఒక రూపాయి ఆదాయం ఎక్కువే వస్తుందన్నారు. జీవోలన్నీ రద్దు చేసేవరకు తమ పోరాటం ఆగదని అల్టీమేటం జారీ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను ఎత్తివేయడం దుర్మార్గమని మండిపడ్డాయి.