విద్యుత్ సంక్షోభం ఇప్పుడు భారత్‌ను టెన్షన్ పెడుతోంది… ఈ తరునంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విద్యుత్ సంక్షోభంపై వెంటనే జోక్యం చేసుకోవాలి లేఖలో విజ్ఞప్తి చేశారు.. యూరోప్, చైనాల్లో ఉన్న విద్యుత్ సంక్షోభం ఇప్పుడు భారత దేశాన్నీ తాకిందని లేఖలో పేర్కొన్న సీఎం.. కోవిడ్ అనంతరం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గత ఆరు నెలల్లో 15 శాతం, గత నెల నుండి 20 శాతం పెరిగిందని.. బొగ్గు నిల్వలు ఆందోళనకరస్థాయిలో పడిపోవడంతో కేంద్ర సహకారాన్ని కోరారు.
ఇక, ఏపీ జెన్ కో అధీనంలోని థర్మల్ ప్లాంట్ స్థాపిత సామర్థ్యంలో 50 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం వైఎస్ జగన్.. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు సైతం తమ సామర్థ్యంలో 75 శాతానికి మించి ఉత్పత్తి చేయలేకపోతున్నాయని.. ఏపీకి 20 బొగ్గు ర్యాక్స్ ను కేటాయించాల్సిందిగా కేంద్ర రైల్వే, బొగ్గు శాఖకు ఆదేశించాలని లేఖలో ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఓఎన్జీసీ, రిలయన్స్ నుంచి అత్యవసర ప్రాతిపదికన రాష్ట్రంలో గ్యాస్ ప్లాంట్లకు గ్యాస్ సరఫరా చేయాలని లేఖలో కోరిన ఏపీ సీఎం.. బొగ్గు కొనుగోళ్ల కోసం డిస్కమ్ లకు సంక్షోభం నుంచి బయటపడే వరకు ఉదారంగా రుణాలు ఇవ్వాలని విన్నవించుకున్నారు.