AP CM YS Jagan Review Meeting On School Education Department: పాఠశాల విద్యాశాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నాడు – నేడు కింద పనుల కోసం ఇప్పటిదాకా రూ. 1120 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు వెంటనే పంపిణీ చేయాలని అధికారుల్ని సూచించారు. ప్రస్తుతం లక్షన్నరకు పైగా ట్యాబ్ లు అందుబాటులో ఉన్నాయి. ట్యాబ్‌లు ఇచ్చిన వెంటనే, అందులో కంటెంట్‌ను వెంటనే లోడ్ చేయాలని జగన్ ఆదేశించారు. 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు కలిపి మొత్తంగా 5,18,740 ట్యాబ్‌లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ముందుగా టీచర్లకు ట్యాబ్ లను అందజేయనున్నారు. అందులో వారికి కంటెంట్ పై అవగాహన కల్పించిన తర్వాత, స్టూడెంట్స్ కి ట్యాబ్స్ పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. బైజూస్ ఇ–కంటెంటును 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందిస్తామన్నారు.
అలాగే.. విద్యాకానుక కిట్లను ఏప్రిల్ నాటికే సిద్ధం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. పిల్లలకు ఇచ్చే యూనిఫారం క్లాత్ సైజును పెంచే ప్రతిపాదనకు, స్టిచ్చింగ్ ధరలు పెంచేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం జతకు రూ.40 ఇస్తుండగా, ఇకపై రూ. 50 ప్రభుత్వం ఇవ్వనుంది. స్కూల్ బ్యాగ్ సైజ్ లలోనూ ప్రభుత్వం మార్పులు చేయనుంది. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకూ మీడియం సైజు స్కూలు బ్యాగులు.. 6 నుంచి 10వ తరగతి వరకూ పెద్ద సైజ్ బ్యాగులను అందించనున్నారు. ఈ బ్యాగుల నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థను థర్డ్ పార్టీగా పెడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో.. స్కూళ్ల మరింత మెరుగైన నిర్వహణ కోసం కొత్త విధానాన్ని కూడా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల విద్యాశాఖ అధికారితో పాటు మరో అధికారి నియమించనున్నారు. సెర్ఫ్‌లో పని చేస్తున్న (ఏపీఎం) అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లకు నాన్ అకడమిక్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తున్నారు. ఈ కొత్త విధానం అక్టోబర్ 17 తేదీ నుంచే అమల్లోకి రానుంది.
ఈ సమావేశం సందర్భంగానే.. సీఎం జగన్ కొన్ని మీడియా సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్‌లో వేల రూపాయల ఖర్చయ్యే కంటెంట్‌ను ఉచితంగా విద్యార్థుల ఫోన్‌లలో డౌన్లోడ్ చేస్తున్నామని, దాన్ని కూడా వక్రీకరించి కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయని అధికారులు తెలిపారు. దీంతో.. విద్యా సంబంధిత కార్యక్రమాలు, మంచి చేసే నిర్ణయాలను కూడా రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరమని జగన్ మండిపడ్డారు. స్కూలు పిల్లలను కూడా రాజకీయాలను నుంచి మినహాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.