కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం కావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను దేశవ్యాప్తంగా వేగవంతం చేశారు. అయితే, అవసరమైనన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉండటం లేదని, వ్యాక్సిన్లు సరిపడా అందించాలని అనేక రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, వ్యాక్సిన్ విషయంలో కేంద్రానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి లేఖ రాయనున్నారు. సరిపడా వ్యాక్సిన్లు అందించాలని కోరుతూనే, ప్రైవేట్ ఆసుపత్రులకు కేటాంచిన డోసుల్ని ఆయా ఆసుపత్రులు సరిగా వినియోగించుకోలేకపోతున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. మూడు నెలల కాలంలో ప్రైవేట్ ఆసుపత్రులకు 43 లక్షల డోసులు కేటాయిస్తే అందులో కేవలం 5 లక్షల డోసులు మాత్రమే వాడారని సీఎం జగన్ పేర్కొన్నారు.
Read: ఆంధ్రాలో థియేటర్స్ రీఓపెన్… రిలీజ్ కు సిద్ధంగా సినిమాలు
ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి అందిస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరికొంత వేగవంతం అవుతుందని కేంద్రానికి రాసే లేఖలో పేర్కొనబోతున్నట్టు సీఎం తెలిపారు. థర్డ్ వేవ్ ముప్పుపై వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సీజన్ ప్లాంట్ల నిర్మాణం వంటి వాటిపై దృష్టి సారిస్తున్నట్టు జగన్ పేర్కొన్నారు. అటు 100 పడకలున్న ప్రైవేట్ ఆసుపత్రులు ఆక్సీజన్ ప్లాంట్ల నిర్మాణం చేసుకోవాలని, ప్లాంట్ల నిర్మాణం చేసుకునే ప్రైవేట్ ఆసుపత్రులకు 30శాతం రాయితీ ఇస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.