మహిళలకు మరో గుడ్‌న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించిన మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధం అయ్యారు.. చిత్తూరు జిల్లా కుప్పం అనగానే మాజీ సీఎం, సీనియర్ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు పేరు గుర్తుకు వస్తుంది.. కొన్ని ఏళ్లుగా కుప్పం చంద్రబాబు అడ్డాగా ఉంది.. అయితే, చంద్రబాబు నియోజకవర్గం నుంచే ఈ సారి వర్చువల్ గా మహిళల ఖాతాల్లో నగదు జమ చేయబోతున్నారు సీఎం వైఎస్ జగన్.. మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 26,39,703 మంది మహిళలకు లబ్ధి చేకూరనుండగా.. రూ.4,949.44 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించనుంది ప్రభుత్వం.. రాష్ట్రంలోని 45 నుండి 60 ఏళ్ళ మధ్య వయస్సు గల మహిళలకు ఆర్ధిక సహాయం అందిస్తూ వస్తుంది సర్కార్.. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ. 18,750ల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్ధిక సహాయాన్ని జమ చేస్తూ వస్తున్నారు.. నాలుగేళ్ళలో ఒక్కొక్కరికి మొత్తం రూ. 75,000 ఆర్ధిక సాయం అందనుంది.. ఇంత వరకు అందించిన మొత్తం సాయం రూ. 14,110.62 కోట్లుగా ఉంది… మహిళలు ఆర్థిక సాధికారత కొరకు వైఎస్సార్ చేయూత పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం వైఎస్ జగన్.
Read Also: NTR Health University Name Change: అందుకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చాం..!
ఈ ఏడాది ఆగస్టు 12 నాటికి 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది వైఎస్ జగన్ సర్కార్.. ఈ చేయూత పథకం ద్వారా 2020 ఆగస్టులో.. తొలి విడత కింద 24,00,111 మందికి 4,500.21 కోట్లు విడుదల చేయగా.. 2022 జూన్ 22న రెండో విడతగా 24,95,714 మందికి 4,679.49 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు.. ఈ రెండు విడతల్లో కలిపి 9179.67 కోట్లను ఇవ్వగా.. మూడో విడతగా సెప్టెంబర్‌లో లబ్ధిదారులకు 18,750 చొప్పున రేపు వారి అకౌంట్‌లో జమ చేస్తారు. ఇక, ఇప్పటికే కుప్పంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన దృష్ట్యా.. అటు అధికార యంత్రాంగంతో పాటు.. ఇటు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి… ఎటు చూసినా.. వైఎస్ జగన్ ఫ్లెక్సీలు, వైసీపీ తోరనాలతో కుప్పం కనిపిస్తోంది..