సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకం మూడో ఏడాది నిధులను సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో వర్చువల్‌గా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రతి ఏడాది రూ.15వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ సాయాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదును జమచేస్తోంది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్లను సీఎం జగన్ జమ చేస్తారు. 2019–20 విద్యా సంవత్సరంలో 42,33,098 మంది లబ్ధిదారులకు రూ. 6,349.53 కోట్లు, 2020–21 విద్యా సంవత్సరంలో 44,48,865 మంది లబ్ధిదారులకు రూ.6,673 కోట్లు, 2021–22 విద్యా సంవత్సరంలో 43,96,402 మంది లబ్ధిదారులకు రూ. 6,595.00 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది.
సీఎం జగన్ పర్యటన షెడ్యూల్:
జూన్ 27 సోమవారం ఉదయం 8:30గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరతారు. ఉదయం 10:30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ అమ్మ ఒడి పథకం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు
కాగా ఈనెల 27న రూ.6,594 కోట్ల నిధులను అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా శ్రీకాకుళంలో మూడోవిడత జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 43.96 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాలలో ఈ నిధులను జమ చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా .. ఇచ్చిన మాటకు జవతాటకుండా అమ్మ ఒడి అందిస్తున్నామని పేర్కొన్నారు. మాటకు కట్టుబడి విద్య , వైద్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అమ్మ ఒడి లబ్ధిదారులను తొలగించారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 75 శాతం హాజరుఉన్న విద్యార్థులందరికీ అమ్మ ఒడి అందిస్తామన్నారు. విద్యార్థులు రోజూ స్కూల్‌కు రావాలని , చదువుకోవాలని అటిండెన్స్ ప్రాతిపదికన ఈ రూల్ పెట్టామన్నారు. ఏ ఒక్కరికీ ఈ పథకాన్ని మిస్ చేసే అవసరం తమకు లేదన్నారు. అటెండెన్స్ సరిపోని వారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్నారు.