ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే గడపనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయనకు వైసీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, వంగా గీత, మాధవి, అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి, గురుమూర్తి, మాధవ్, రంగయ్య, రెడ్డప్ప, సత్యవతి, కోటగిరి శ్రీధర్, మోపిదేవి వెంకటరమణ జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ వరుసగా ప్రధానితో పాటు కేంద్రమంత్రులను కలవనున్నారు. ఈరోజు సాయంత్రం 4:45 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో సీఎం జగన్ చర్చించనున్నారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా బుధవారం నాడు కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, గజేంద్రసింగ్ షెకావత్‌లను కలవనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలిపాలని, ఏపీకి ఆర్థిక చేయూత అందించాలని, ఏపీ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని, ఏపీలో కొత్తగా 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సహకరించాలని కేంద్రమంత్రులను సీఎం జగన్ కోరనున్నారు.