అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంక గ్రామంలో సీఎం జగన్ ఇంటింటికి తిరిగి వరద బాధితులను పరామర్శించారు. వరద బాధితులందరినీ ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని సీఎం జగన్ తెలిపారు. ఏ వరద బాధితుడికి సహాయం అందలేదనే మాట రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గంటి పెదపూడి లంక గ్రామానికి అవసరమైన బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు. ఏ సీజన్ లో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఆ సీజన్‌లోనే పరిహారం అందజేస్తామన్నారు. పశువులకు ఎటువంటి కష్టం రాకుండా చర్యలు చేపడతామన్నారు. గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేయిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. గంటి పెదపూడిలో తమకు మరో విలేజ్ క్లినిక్ కావాలని గ్రామస్తులు కోరగా సీఎం జగన్ ఆమోదం తెలిపారు.
సహాయక శిబిరాల్లో బాగా చూసుకున్నారా? కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయవచ్చని వరద బాధితులను స్వయంగా సీఎం జగన్ అడిగారు. పర్యటనలో భాగంగా నక్కా విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శిస్తూ సీఎం వారి 8 నెలల బాబును ఎత్తుకున్నారు. ఆ సమయంలో బాబు జగన్ జేబులోంచి పెన్ తీసుకోగా.. తన పెన్‌ను సీఎం గిఫ్టుగా ఇచ్చారు. అటు గోదావరి వరదల సమయంలో బాధితులందరికీ అండగా నిలిచామని సీఎం జగన్ చెప్పారు. వరదల సమయంలో తాను ఇక్కడికి వచ్చి ఉంటే అధికారులు తన చుట్టూ తిరిగేవారని.. అప్పుడు ప్రజలకు మంచి జరిగేది కాదని, అందుకే అధికారులకు వారం రోజుల టైం ఇచ్చి ఆ తర్వాత వచ్చానన్నారు. ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలన్న జగన్.. సీఎం అంటే ఇలా చేయాలన్నారు. ప్రభుత్వ సాయం అందిందని బాధితులే చెబుతుంటే తనకు సంతోషంగా ఉందన్నారు.
Read Also: Botsa Satyanarayana: అప్పులపై ఈడీ విచారణ..? అసలు చంద్రబాబుకు బుద్ధి ఉందా?
తనది ప్రచార ఆర్భాటం కాదని.. తాను కూడా వరదల సమయంలో ఇక్కడికి వచ్చి, ఫోటోలకు ఫోజులిచ్చి డ్రామాలు చేస్తే టీవీల్లో కనిపించే వాడిని అని జగన్ అన్నారు. కానీ దాని వల్ల ఏం ప్రయోజనం ఉండదన్నారు. ముఖ్యమంత్రి అనే వాడు వ్యవస్థలను నడిపించాలన్నారు. ప్రజలకు మంచి జరిగేలా చూడాలన్నారు. సరైన సమయంలో సరైన సహాయం అందేలా చూడాలన్నారు. ఆ తర్వాత అది అందిందా.. లేదా.. అన్నది కూడా పరిశీలించాలన్నారు. అదే విధంగా అధికారులు తమ విధులు సమర్థంగా నిర్వర్తించేలా నిర్దేశించాలన్నారు. వారికి తగిన వనరులు కూడా సమకూర్చాలని తెలిపారు. అందుకే సహాయ పనులు, కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా అధికారులకు వారం రోజుల సమయం ఇచ్చానని.. ఇప్పుడు తాను వచ్చానని.. బాధితులకు సహాయ కార్యక్రమాలు ఎలా అందాయన్నది స్వయంగా తెలుసుకోవడానికి వచ్చానని జగన్ పేర్కొన్నారు. వరద నష్టంపై అంచనాలు కొనసాగుతున్నాయని సీఎం జగన్ అన్నారు. అవి అందగానే అందరినీ ఆదుకుంటామన్నారు. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.