CM Jagan Mohan Reddy: కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సీఎం జగన్ వైఎస్ఆర్ కాపునేస్తం మూడో ఏడాది నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమది మనసున్న ప్రభుత్వమని.. మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్ఆర్ కాపునేస్తం అనే పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ పథకం ద్వారా ప్రతి కాపు, బలిజ, ఒంటరి, తెలగ కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటున్నామని తెలిపారు. వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా మహిళలకు రూ.15వేలు ఇస్తున్నామని.. ఇప్పటివరకు వారి చేతిలో రూ.45వేలు పెట్టినట్లు పేర్కొన్నారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కుటుంబాలకు చెందిన మహిళలు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేందుకు క్రమం తప్పకుండా ప్రతి ఏటా వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు చేస్తున్నామని జగన్ అన్నారు. ఈ పథకం ద్వారా వరుసగా మూడో ఏడాది 3,38,792 మందికి నేరుగా వారి చేతుల్లో రూ.508 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు.
గత మూడేళ్లలో కాపు నేస్తం ఒక్క పథకానికే రూ.1492 కోట్లు అక్కాచెల్లెమ్మలకు అందించామన్నారు. తమ ప్రభుత్వంలో DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో DPT(దోచుకో, పంచుకో, తినుకో) ఉండేదని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు హయాంలోని డీపీటీ కావాలా? లేదా తమ ప్రభుత్వం ఇస్తున్న డీబీటీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. దుష్టచతుష్టయంతో కలిసి చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని… పేదలకు సంక్షేమాన్ని ఇవ్వాలన్న ఆలోచన కూడా చంద్రబాబుకే లేదని జగన్ విమర్శించారు.
Read Also: What is the value of marriage? : ఇతరుల మోజులో పడి విలువలు కోల్పోతున్నారా? వివాహ బంధానికి విలువేది?
డీబీటీ, కార్పొరేషన్ ద్వారా ఏకంగా రూ.16,250 కోట్లు అందించామని.. ఇవి కాక ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టే పథకాలు, నాన్ డీబీటీ ద్వారా కలిగించిన లబ్ధి మరో రూ.16వేల కోట్లు ఉంటాయన్నారు. 2.46 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి పట్టాల విలువే రూ.12వేల కోట్లు ఉంటుందన్నారు. 1.2 లక్షల మందికి ఇళ్లు కట్టే కార్యక్రమం కూడా మొదలైందని.. కాపులకు ప్రతి ఏటా రూ.వేయి కోట్లు ఐదేళ్ల కాలంలో రూ.5 వేల కోట్లు పెడతానని చెప్పి కనీసం రూ.1500 కోట్లూ ఖర్చు పెట్టని ఆ పెద్ద మనిషి పాలనలో పరిస్థితిని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ఆయన చేసిన అనేక అబద్ధాలు, మోసాలు మాదిరిగానే మరొక మోసంగా ఇది కూడా మిగిలి పోయిందని ఎద్దేవా చేశారు. తాము మేనిఫెస్టోలో చేసిన వాగ్దానం ప్రకారం రూ.2వేల కోట్లు ఇస్తామని చెప్పామని.. అలా ఐదేళ్లలో రూ.10వేల కోట్లు ఇస్తామని చెప్పామని.. కానీ ఇవాళ 3 ఏళ్లు కూడా తిరగకముందే రూ.32,296 కోట్లు ఇవ్వగలిగామని సగర్వంగా చెబుతున్నట్లు జగన్ వివరించారు.