ఏపీలో పాఠశాలలకు మే 6 నుంచి జూలై 3 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సెలవులు టీచర్లకు వర్తించవు అని.. మే 20 వరకు టీచర్లు పాఠశాలలకు రావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా స్పందించారు. టీచర్లకు సెలవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. టీచర్లకు సెలవులు వేసవి కాలంలో కాకుండా వర్షాకాలంలో ఇస్తారా అంటూ ఎద్దేవా చేశారు. మే 7వ తేదీతో పరీక్షలు అయిపోతుండగా టీచర్లకు సెలవులు ఎందుకు ఇవ్వరని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరీక్షల అనంతరం వాల్యుయేషన్ డ్యూటీలో ఉండే ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా డొంక తిరుగుడుగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.
అటు విజయవాడలో ఉపాధ్యాయుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం 144 సెక్షన్ విధించడంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. గతంలో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనే అధికార దాహంతో జగన్ అడ్డగోలుగా హామీలు ఇచ్చారని.. ఎన్నికల ప్రచార సమయంలో చిటికెలు వేసి మరీ అన్ని సభలోనూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆరోపించారు. ప్రస్తుతం తాను ఇచ్చిన మాట జగన్ మర్చిపోయినా.. ఉద్యోగులు మరిచిపోలేదని కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లి ప్రాంతం కాశ్మీర్ బోర్డర్‌ను తలపించేలా ఉండటం దురదృష్టకరమన్నారు. అన్యాయంగా అరెస్ట్ చేసిన ఉపాధ్యాయ సంఘాలను వెంటనే విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
Botsa Satyanarayana: సీఎం ఇంటిని ముట్టడిస్తానని చెప్పడం సరికాదు