ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారనుందా? అధికార పార్టీతో బీజేపీ ఇక అమీతుమీ తేల్చుకోనుందా? అందుబాటులో ఉన్న ఏపీ బీజేపీ ముఖ్య నేతల భేటీ వాడివేడిగా సాగింది. బీజేపీ కార్యాలయంలో సమావేశమైన సోము వీర్రాజు, జీవీఎల్, ఐవైఆర్, సత్య కుమార్ పలు అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వ విధానాలపై ఇక యుద్దం చేయాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు కమలనాధులు.
తెలంగాణ బీజేపీ తరహాలో ఇకపై ఢీ అంటే ఢీ అన్నట్టు వ్యవహరించాలని భావిస్తోంది ఏపీ బీజేపీ. కేంద్ర నిధులతో అమలు చేసే పథకాలకు తమ పేర్లు పెట్టుకున్నారనే అంశంపై చర్చ జరిగింది. ప్రభుత్వ విధానాలతో పాటు.. ఏపీలో కేంద్ర నిధుల వినియోగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. త్వరలో జయశంకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి కేంద్ర మంత్రుల పర్యటనలను సక్సెస్ చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
విభజన చట్టాన్ని ఏపీలో కేంద్రం ఏ విధంగా అమలు చేసిందోననే అంశాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లబోతున్నాం అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రైల్వే భూమిని వెనక్కు ఇవ్వడం లేదు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు, పెట్రో కెమికల్ యూనివర్సిటీకి భూమిని ఇప్పటి వరకు కేటాయించలేదన్నారు.
విజయవాడ,గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించడం లేదని మండిపడ్డారు. ఎయిమ్స్ పూర్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నీటిని సప్లై చేయడం లేదు. ఏపీలో కేంద్ర మంత్రులు త్వరలోనే పర్యటించబోతున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తారని ఎంపీ జీవిఎల్ వివరించారు. పోలవరం స్కాంపై ఇప్పటి వరకు సీఎం జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు..? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు పోలవరంలో కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి అధికారంలోకి వచ్చాక అప్పటి బిల్లులను ఎలా క్లియర్ చేశారు..? కేంద్ర ప్రభుత్వం కడుతున్న పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏంటి ? అన్నారు జీవీఎల్.
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనపై కార్యాచరణ సిద్ధం చేశాం. ఏపీలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు స్టిక్కర్ ప్రభుత్వాలుగా మారాయి. విభజన చట్టం 13వ షెడ్యూల్లో ఉన్న అన్నిటినీ కేంద్రం పూర్తి చేసింది. విభజన చట్టం ప్రకారం కేంద్ర విద్యా సంస్థలను ఏపీలో నిర్మించాం. 10 రాష్ట్రాల్లో లేని జాతీయ విద్యా సంస్థలను ఏపీలో నిర్మించాం. రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను వదిలేస్తున్నాయన్నారు సత్యకుమార్.
40 ఏళ్ల రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను చెల్లించడం లేదు. అమరావతి నుంచి అనంతపురం వరకు నిర్మించాల్సిన జాతీయ రహదారిపై ఒక్క అడుగు ముందుకు పడలేదు. అమ్మఒడి మినహా ఏ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో నిర్వహించడం లేదు. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వమిచ్చే నిధులతో పథకాలు నిర్వహించడం లేదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పగలరా?
Read Also: https://ntvtelugu.com/andhra-pradesh-news/somu-veerraju-letter-to-cm-jagan-155947.html
ఏ ఏ ప్రాజెక్టులు నిలిపివేశారో ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం. రాజధానిపై కోర్టు తీర్పు తరువాత ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలన్నారు సత్యకుమార్. మాజీ సీఎస్, బీజేపీ సీనియర్ నేత ఐవైఆర్ కృష్ణా రావు మాట్లాడుతూ బీజేపీ చేసిన అభివృద్ధిని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. దేశం మొత్తం బీజేపీకి అనుకూలంగా నడుస్తున్న వేళ.. ఏపీలో మాత్రం బీజేపీని అడ్డుకునే ప్రయత్నాలు కొన్ని శక్తులు చేస్తున్నాయి. బీజేపీ ఏపీకి చేసిన అభివృద్ధిపై పుస్తకాన్ని ప్రచురించబోతున్నాం. ఏపీకి బీజేపీకి చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసురుతున్నాం అన్నారు ఐవైఆర్ కృష్ణా రావు,