Assembly paying tribute to Rosaiah.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతికి సంతాప తీర్మానం చేశారు. ఈ సందర్భంగా టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో రోశయ్య ప్రత్యేక ముద్ర వేసుకున్నారని, విలువలతో కూడిన రాజకీయం చేశారని ఆయన కొనియాడారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సేవలు ఎనలేనివని గుర్తు చేశారు. రోశయ్య మరణంపై రాజకీయం చేయాలనుకోవడం లేదని, మేం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు మృతి చెందినా గౌరవించామన్నారు.
రోశయ్య సేవలను గుర్తించేలా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన అన్నారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యార్ధి నాయకుడు నుంచి గవర్నర్ వరకు ఎదిగారని, ఏ పదవిచ్చినా బాధ్యతతో పని చేశారని ఆయన అన్నారు. ఉమ్మడి ఏపీలో ఐదుగురు సీఎంల దగ్గర పని చేశారని, నాన్నగారితో స్నేహ బంధం ఉందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు సభలో మౌనం పాటించారు.