AP and Telangana Rains LIVE UPDATES: వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా జారీ అయింది. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లను రద్దు చేయగా.. మరి కొన్ని రైళ్లను దారి మళ్లీంచింది సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని నిషేధం విధించారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
ప్రకాశం బ్యారేజీ వరద తగ్గుముఖం పడుతోంది. ప్రకాశం బ్యారేజీకి రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 70 గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేశారు. సముద్రంలోకి 11,06,126 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాలువలకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,06,626 క్యూసెక్కులుగా ఉండగా.. బ్యారేజీ నీటిమట్టం 22.6 అడుగులుగా ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నిర్మల్ ,కొమురం భీం,ఆదిలాబాద్ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగా నది శాంతిస్తోంది. నది ప్రవాహం తగ్గుతోంది. రెండు రోజుల తర్వాత ఆనంద్ పూర్ బ్రిడ్జి తేలింది.
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా సుమారు 500 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు పాడయినట్లు ప్రాథమిక అంచనా. శాశ్వత ప్రాతిపదికన వాటి పునరుద్ధరణకు 363 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. గ్రామీణ రోడ్ల పరిస్థితులపై మంత్రి సీతక్కకు ఎప్పటికప్పుడు నివేదికలను అధికారులు అందజేస్తున్నారు. సమగ్ర నివేదిక రూపొందించి మరమ్మతు పనుల కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడలోని సింగ్ నగర్‌లో గంటన్నర సేపు సీఎం చంద్రబాబు పర్యటించారు. బోట్ల ద్వారా తరలించిన, స్వచ్ఛందంగా బయటకు వచ్చిన బాధితులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వారి ఆవేదన, బాధలను, రెండు రోజులుగా పడుతున్న కష్టాలను సీఎంకు వివరించారు. ఊహించని ఉత్పాతం వల్ల పడిన ఇబ్బందులను సీఎంకు వివరించారు. ఇప్పటికీ బంధువులు, ఇరుగు పొరుగు వారు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నారని తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి నీళ్లు, ఆహారం అందిందని, ఎన్డీఆర్ఎఫ్ బోట్ల ద్వారా బయటకు రాగలిగామని సీఎంకు చెప్పారు. చుట్టుముట్టిన వరద నీటితో తాము ప్రాణాలతో బయటకొస్తామనుకోలేదని రోధిస్తూ పలువురు మహిళలు చెప్పారు. వరద ప్రాంతాల నుంచి బయటకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులను అంబులెన్స్ లో తరలించేందుకు ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేశారు.
విరిగిన కౌంటర్ వెయిట్ బండ్ ను ఏర్పాటు చేయడానికి కన్నయ్య నాయుడుతో పరిశీలించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 69వ కౌంటర్ వెయిట్ బండ్ వరద ఎఫెక్ట్ తగ్గగానే ఏర్పాటు చేస్తామన్నారు. పడవలు కొట్టుకు రావడంలో కుట్ర కోణం ఉందని అనుమానాలు ఉన్నాయన్నారు. దానిపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కృష్ణాజిల్లా : గన్నవరం విమానాశ్రయం లో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. విజయవాడ నుండి బస్సులు, రైళ్లు నిలిచిపోవడంతో విమానాల్లో వెళ్లేందుకు ప్రయాణీకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో విమాన టికెట్ ధరలు పెరిగాయి. విమానాలు లేక ఎయిర్‌పోర్టులో ప్రయాణీకులు పడిగాపులు కాస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ సమీప ప్రాంతంలోని డిండి వాగులో 11 మంది చెంచులు చేపల వేటకు వెళ్లారు. డిండి వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగులోనే బండలపై చిక్కుకున్నారు. అచ్చంపేట డీఎస్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ రవీందర్, పోలీస్ సిబ్బంది వారి కోసం గాలిస్తున్నారు..
ఆదిలాబాద్ జిల్లాలో రేపు(మంగళవారం) విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు 3 వ తేదీన సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు సెలవు పాటించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
విపత్తుల సమయంలో రాజకీయాలు వద్దని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రజలలో సమస్యలు లేదా ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలన్నారు. అధికారంలో గతంలో ఉన్నవాళ్లు వారి అనుభవాలతో సూచన చేయాలన్నారు. విపత్తులను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను గట్టెక్కించడం కోసం సమిష్టిగా పని చేయాలని మంత్రి సూచించారు. వరదలతో ప్రభావితమైన జిల్లాల్లో సహాయ చర్యల కోసం రూ. 5 కోట్లు విడుదల చేశామన్నారు.
ప్రకాశం బ్యారేజీకి గంట గంటకూ వరద తగ్గుతోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రమంగా వరద తగ్గుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద ఉండగా.. ప్రస్తుతం 11.20 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. క్రమంగా వరద మరింత తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది.
ప్రకృతి విపత్తులు, వరదల్లో చనిపోయిన వారికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
సూర్యాపేట జిల్లా: హైదరాబాద్-విజయవాడ మధ్య వాహనాల రాకపోకలకు లైన్ క్లియర్ అయింది. 65వ నెంబర్ జాతీయ రహదారి రామాపురం క్రాస్ రోడ్ వద్ద వరద ప్రవాహం తగ్గడంతో వాహనాల రాకపోకలకు అనుమతి లభించింది.ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద జాతీయ రహదారిపై ఉన్న.. కొత్త వంతెనపై ఇరువైపులా వాహనాలు వెళ్లే విధంగా ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరించారు.
ప్రకాశం బ్యారేజ్ దగ్గర విరిగిన కౌంటర్ వెయిట్ బండ్‌ను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. కొత్త కౌంటర్ వెయిట్ బండ్ ఏర్పాటుపై అధికారులతో చర్చలు జరిపారు. గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడుతో కలిసి మంత్రి పరిశీలించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి తీరాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. గోదావరి తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు.
కడెం ప్రాజెక్టును మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పరిశీలించారు. కడెం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద పరిస్థితి,వరద గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటి వివరాలు,ప్రాజెక్టు వద్ద చేపట్టిన అప్రమత్తం చర్యలు తదితర వాటి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఉన్నందున ఎవరు గోదావరి పరివాహక ప్రాంతాలకు వెళ్లకూడదని మంత్రి కోరారు.
విజయవాడ-హైదరాబాద్ రూట్‌లో రాకపోకలకు లైన్ క్లియర్ అయింది. ఐతవరం దగ్గర హైవేపై చేరిన వరద నీరు తగ్గటంతో అధికారులు వాహనాలను అనుమతిస్తున్నారు. బురద పేరుకు పోవటంతో వాహనాలను ఆ ప్రాంతంలో నెమ్మదిగా దాటిస్తున్నారు.
నిజమాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద అంతరాష్ట్ర బ్రిడ్జిని ఆనుకొని గోదావరి నది ప్రవహిస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర-తెలంగాణ మధ్య రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ధర్మాబాద్ వెళ్ళాల్సిన వారు బాసర నుంచి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. కందకుర్తి గోదావరి తీరానికి ఎవరు రాకూడదని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 2లక్షల 51 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. 40 గేట్లు ఎత్తి 2లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అర్థరాత్రి మరో లక్షకు పైగా వరద పెరిగే అవకాశం ఉంది. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రజలను అలెర్ట్ చేశారు.
నిజామాబాద్ జిల్లా సావెల్ వద్ద ఆశ్రమంలో చిక్కుకున్న ముగ్గురు పశువుల కాపరులను ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ చేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. శ్రీరాం సాగర్ వరద గేట్లు ఎత్తడంతో భారీగా వరద వచ్చి చేరింది. ముగ్గురు పశువుల కాపారులతో పాటు ఆశ్రమంలో 24 ఆవులు చిక్కుకున్నాయి. బోట్ సహాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని అధికారులు సురక్షితంగా కాపాడారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరద పరిస్థితులపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. గోదావరి, మంజీరా నదులకు వరద ఉధృతిని తెలుసుకున్నట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ రాత్రికి మహారాష్ట్ర నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉన్నట్లు సీఎం చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని నిర్మల్, జగిత్యాల కలెక్టర్లకు ఆదేశాలు చేశారు.
రేపు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంఘ్వన్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్, స్కూల్, కళాశాలలకు కలెక్టర్ రాహుల్ గాంధీ హన్మంతు సెలవులు ప్రకటించారు.
కామారెడ్డి : నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 48,800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00.అడుగులు కాగా.. ప్రస్తుతం 1397.82 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు గా.. ప్రస్తుతం 9.156 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో 15 రైళ్లను రద్దు చేశారు. ఇప్పటికే 496 రైళ్లను తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా రద్దు చేసింది.ఇప్పుడు తాజాగా 15 రైళ్లను రద్దు చేశారు. మరో 10 రైళ్లను దారి మళ్లించారు.ఇప్పటివరకు 163 రైళ్ళను పైగా దారి మళ్లించింది దక్షిణ మధ్య రైల్వే.
హైదరాబాద్: సెక్రటేరియట్‌లోని వరద సహాయ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిన్నటి నుంచి ఇప్పటి వరకు 120 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా నుంచి ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలిసింది. ఆయా జిల్లాల్లో పరిస్థితుల మేరకు ఇప్పటి వరకు 69 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 2761 మందికి పునరావాస కేంద్రంలో ఆశ్రయం కల్పించారు.
కుందు నది, మద్దిలేరు శాంతించడంతో నంద్యాలకు ముప్పు తప్పింది.యధావిధిగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.
విజయవాడ బస్టాండ్ గందరగోళంగా మారింది. బస్సులు ఉన్నాయో రద్దు అయ్యాయో తెలియక ప్రయాణికుల అవస్థలు పడుతున్నారు. ట్రైన్స్ రద్దు కావడం డైవర్ట్ కావడంతో ప్రయాణికులను రైల్వే అధికారులు బస్టాండ్‌కి తీసుకు వస్తున్నారు. గంటల తరబడి బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. వచ్చిన బస్సులు నిమిషాల్లోనే ఫుల్ అయిపోతున్నాయి. హైదరాబాద్ వెళ్లే బస్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
వర్షాలు, వరదల దెబ్బకి విమాన ప్రయాణాలకు రద్దీ పెరిగింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, రైలు మార్గాలలో అంతరాయం ఏర్పడడంతో గన్నవరం విమానాశ్రయంలో రద్దీ పెరిగింది. పెరిగిన రద్దీతో టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూలైన్ ఉంది. పెరిగిన ప్రయాణీకులకు తగిన విమానాలు లేకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రకాశం బ్యారేజీని సీఎం చంద్రబాబు పరిశీలించారు. బ్యారేజ్ వద్దకు కొట్టుకొచ్చిన బోట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. విరిగిన కౌంటర్ వెయిట్ బండ్‌ను పరిశీలించారు. కొత్త కౌంటర్ వెయిట్ బండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడుతో సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.
ఖమ్మం జిల్లా పోలేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మున్నేరు వరద కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ కోసం 650 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించామన్నారు. వరద వల్ల వందలాది కుటుంబాలు సర్వం కోల్పోయారని.. వరదలో నష్ణపోయిన కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేయాలని ఆదేశిస్తున్నామన్నారు. నష్ణపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద పదివేలు అందజేస్తామన్నారు. నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందజేస్తామన్నారు. బాధితులు ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చెప్పారు.
బాపట్ల జిల్లా రేపల్లె మండలం రావి అనంతారం వద్ద కృష్ణా కరకట్ట తెగిపోయింది.. కరకట్ట వెంబడి నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు .. కరకట్టకు పడిన గండిని పూడ్చేందుకు స్థానికులతో కలిసి పోలీసుల ప్రయత్నాలు.. రేపల్లె పట్టణానికి ముంపు ప్రమాదం..
భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు ఈ నెల 3వ తేదీన సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పెద్దపులివర్రు గ్రామంలో బలహీనమైన కృష్ణా కరకట్ట... ఏ క్షణంలో అయినా కట్ట తెగే ప్రమాదం .. పలు ప్రాంతాల్లో బలహీనంగా మారిన కృష్ణ కరకట్ట... అనేక ప్రాంతాల్లో గ్రామస్తులు స్వచ్ఛందంగా వచ్చి కట్టలను పటిష్టం చేస్తున్న ప్రజలు..
కృష్ణానది వరద 12 లక్షల క్యూసెక్కులు చేరుతుందనే అంచనా నేపథ్యంలో జిల్లా వాసులు ఆందోళనలో ఉన్నారు.. ప్రకాశం బ్యారేజ్ దిగువున ఉన్న విజయవాడ సిటీ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డలకు ముప్పు తప్పదనే భయాందోళనకు గురవుతున్నారు.. పెరుగుతున్న వరద దెబ్బకి జిల్లా వాసులు వణికిపోతున్నారు.. ఇప్పటికే సిటీలో ఇల్లను వదిలి వెళ్తున్న ప్రజలు.. పామర్రులో పూర్తిగా లంక గ్రామలు మునిగిపోయాయి..
కుందూనది , వాగుల వద్ద నిఘా పెట్టాలి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడించారు. పోలీస్ ,రెవెన్యూ ,ఇరిగేషన్ ఆర్.డబ్యు.ఎస్ ,సోషల్ వెల్ఫేర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే వేంపెంటలో డయేరియా విజృంభించిందని మండిపడ్డారు. నల్లమల అడవిలో కురిసిన భారీ వర్షాల వల్ల నందికొట్కూరు, శ్రీశైలం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వరుసగా మూడో రోజు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్కూల్స్‌కి ప్రభుత్వం సెలవు ఇచ్చింది. గత శనివారం నుంచి భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం సెలవు ఇస్తోంది.
విజయవాడలోని సింగ్ నగర్ వరద ప్రభావిత ప్రాంతాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరిశీలించారు. సింగ్ నగర్ ఫ్లై ఓవర్‌పై వస్తూ బాధితులను పరామర్శించారు. కాలనీల్లో వరద ఉధృతిపై స్థానికులను ఆరా తీశారు. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు జగన్ ట్రాక్టర్‌లో బయలుదేరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం చేరుకున్నారు. మున్నేరు వరద ప్రభావిత కాలనీలను పరిశీలించి, బాధితులకు సీఎం మాట్లాడారు. పోలేపల్లి రాజీవ్ గృహకల్ప కాలనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు.
విజయవాడలోని రాజరాజేశ్వరి పేట పూర్తిగా నీట మునిగింది. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. రెండు రోజుల నుంచి వరద ముంచెత్తడంతో పిల్లలు, వృద్దులు గర్భిణీ స్త్రీలతో ప్రమాదకర పరిస్థితిల్లో వరద దాటుతున్నారు. పీకల్లోతు నీళ్లలో మంచినీటి కోసం పేట వాసులు సాహసాలు చేస్తున్నారు. కాలనీలో చిక్కుకున్న వేలాది మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వారు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు.
అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు...
విజయవాడ సెంట్రల్
1. ఇందిరానగర్ కాలనీ- సుధాకర్ 9640909822
2. రామకృష్ణాపురం- వెంకటేశ్వర్లు 9866514153
3. ఉడా కాలనీ- శ్రీనివాస్ రెడ్డి 9100109124
4. ఆర్ఆర్ పేట- వి. పెద్దిబాబు 9848350481
5. ఆంధ్రప్రభ కాలనీ- అబ్దుల్ రబ్బానీ 9849588941
6. మధ్యకట్ట- టి. కోటేశ్వరరావు 9492274078
7. ఎల్బీఎస్ నగర్- సీహెచ్ శైలజ 9100109180
8. లూనా సెంటర్- పి. శ్రీనివాసరావు 9866776739
9. నందమూరి నగర్- యు. శ్రీనివాసరావు 9849909069
10. అజిత్సింగ్ నగర్- కె. అనురాధ 9154409539
11. సుబ్బరాజునగర్- సీహెచ్ ఆశారాణి 9492555088
12. దేవినగర్ - కే.ప్రియాంక 8500500270
13. పటేల్ నగర్- కె. శ్రీనివాసరావు 7981344125
విజయవాడ పశ్చిమ
14. జోజినగర్- వీకే విజయశ్రీ 9440818026
15. ఊర్మిలా నగర్- శ్రీనివాస్ 8328317067
16. ఓల్డ్ ఆర్ఆర్ పేట- ఎస్ఏ ఆజీజ్ 9394494645
17. పాల ఫ్యాక్టరీ ఏరియా- జె. సునీత 9441871260
విజయవాడ తూర్పు
18. రాజరాజేశ్వరీ నగర్- పి. వెంకటనారాయణ 7901610163
19. మహానాడు రోడ్డు- పి.బాలాజీ కుమార్ 7995086772
20. బ్యాంకు కాలనీ- హేమచంద్ర 9849901148
21. ఏపీఐఐసీ కాలనీ- ఎ. కృష్ణచైతన్య 9398143677
22. కృష్ణలంక - పీఎం సుభాని 7995087045
23. రామలింగేశ్వరనగర్- జి. ఉమాదేవి 8074783959
విజయవాడ రూరల్
24. గొల్లపూడి- ఈ. గోపీచంద్ 9989932852
25. రాయనపాడు- సాకా నాగమణెమ్మ 8331056859
26. జక్కంపూడి - నాగమల్లిక 9966661246
27. పైడూరుపాడు- శ్రీనివాస్యాదవ్ 7416499399
28. కేవీ కండ్రిక- మహేశ్వరరావు 9849902595
29. అంబాపురం- బి. నాగరాజు 8333991210
విజయవాడలోని కృష్ణా తీర ప్రాంతానికి సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గ వారధి, కృష్ణలంక ప్రాంతాల్లో కృష్ణ వరదను చూసేందుకు జనం పోటెత్తారు. మరోపక్క ఇల్లు మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనవసరంగా రోడ్ల పైకి వస్తున్న వారితో ట్రాఫిక్ జాం అవుతుందని, సహాయ కార్యక్రమాలకు ఇబ్బందులు వస్తున్నాయని, సందర్శకులు సెల్ఫీల వ్యవహారాలు ఆపాలని అధికారులు సూచిస్తున్నారు.
విజయవాడలో కోట్ల రూపాయల విల్లాలను బుడమేరు ముంచేసింది. సామాన్య మధ్య తరగతి వర్గాల నివాసాలతో పాటు కోట్ల రూపాయలు విలువ చేసే విల్లాల దగ్గరకు బుడమేరు చేరుకుంది.సెల్లార్లలో మోకాలి లోతు వరద నీరు నిలిచిపోవడంతో విల్లాస్ నుంచి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. సెల్లార్, గేటెడ్ కమ్యూనిటీలలో రోడ్లపై కార్లు నీట మునిగాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం, ఈదురుగాలులతో భారీగా చెట్లు కూలిపోయాయి. నగరంలో 52 భారీ వృక్షాలు కూలినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 48 చెట్లను డీఆర్‌ఎఫ్ సిబ్బంది తొలగించారు.
వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో 31 రైళ్లు రద్దయ్యాయి. ఇప్పటికే 450 రైళ్లను తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇప్పుడు తాజాగా 31 రైళ్లను రద్దు చేసింది. మరో 13 రైళ్లను దారి మళ్లించారు. ఇప్పటివరకు 153 రైళ్లకు పైగా దక్షిణ మధ్య రైల్వే దారి మళ్లించింది.
ఖమ్మం జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఘనస్వాగతం పలికారు. కూసుమంచి మండలంలో పంట పొలాలను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించారు.
ఖమ్మం జిల్లాలోని నాయకన్‌గూడెం దగ్గర దెబ్బ తిన్న రోడ్డు, పాలేరు ఏరును సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పరిశీలించారు.
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో తగ్గుతోంది. 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 22,401 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 14, 576 క్యూసెక్కులుగా ఉంది.
ఏపీలో వరద బాధితులకు ఆహార పంపిణీ కోసం హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం రెండు హెలికాప్టర్ల ద్వారా బుడమేరు ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆహారం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 3 టన్నులకు పైగా ఆహారం, నీళ్లు బాధితులకు అందజేశారు. బిస్కట్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, బ్రెడ్, ఫ్రూట్ జ్యూస్ టెట్రాప్యాక్స్, ఇతర ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా బాధితుల ఇళ్లపై ఆహార ప్యాకెట్లను సిబ్బంది జారవిడుస్తున్నారు. మరో రెండు హెలికాఫ్టర్లు కూడా సహాయ చర్యలు, సేవల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.
గండిపేట్, హిమాయత్ సాగర్ జలాశయాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించారు.