Anilkumara Yadav: వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి తానే పోటీ చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వచ్చే దఫా తన నియోజకవర్గం మారుస్తారని పుకార్లు షికార్లు చేస్తుండటంతో ఆయన ఈ ప్రకటన చేశారు. అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జగన్ గీసిన గీత దాటడు అని మరొకసారి మళ్ళీ చెప్తున్నానని వివరించారు. తాను రాష్ట్రంలో తలవంచేది ఒకే ఒక్క జగన్‌కు మాత్రమే అని తెలిపారు. టీ బంకుల దగ్గర చేరి మాట్లాడుకునేవారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.
Read Also: Pataan: ట్విట్టర్ రివ్యూ… షారుఖ్ హిట్ కొట్టినట్లేనా?
తన సీటుపై దుష్ప్రచారం చేస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారని, కొన్నిరోజులు వారిని అలాగే ఆనందాన్ని పొందనివ్వాలని, ప్రశాంతంగా నిద్రపోనివ్వాలని అనిల్ కుమార్ సూచించారు. తనకు టికెట్ రాకపోతే 2024లో పోటీచేసిన తర్వాత వారంతా నిద్రలేని రాత్రులు గడపాలన్నారు. కాగా నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్‌కు వ్యతిరేకంగా ఆయన బాబాయ్ రూప్ కుమార్ వర్గం పావులు కదుపుతోంది. ఇప్పటికే నెల్లూరు నగర కార్పొరేటర్లలో చీలిక వచ్చింది. సగం మంది అనిల్ వర్గం, సగం మంది రూప్ కుమార్ వర్గంలో చేరిపోయారు. ఇటీవల నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కూడా రూప్ కుమార్ వర్గంలో కలిసిపోయారు. దీనికితోడు ఇరుగు పొరుగు నియోజకవర్గాల వారు కూడా అనిల్‌కు వ్యతిరేకంగా గూడుపుఠానీ నడుపుతున్నారనే అనుమానం అనిల్ కుమార్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తన సీటుపై క్లారిటీ ఇచ్చారు.