ఉత్తరాంధ్ర విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ జలం కోసం-ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర సాగిస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు. జలం కోసం – ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర ఈనెల 7వ తేదీ 9గంటలకు మొదలవుతుందన్నారు. త్రాగు , సాగునీటి ప్రాజెక్ట్ ల సాధన కోసం మూడు రోజులు యాత్ర సాగిస్తామన్నారు.
ఇప్పటికే రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించామని, ముఖ్య అతిధిగా సునీల్ దేవదర్ , ఎంపీలు హాజరవుతారని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. నేరడి బ్యారేజ్ , నిర్వాసితుల సమస్యపై మాట్లాడతామన్నారు. వంశధార నది నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ప్రభుత్వానికి చిత్త శుద్దిలేదు. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ద్వారా నదుల అనుసంధానం చేయాలి వాటిని పట్టించుకోలేదు.
మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర యాత్ర కొనసాగుతుందని, ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు అన్నారు మాధవ్. తక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తే లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. కేవలం 500 కోట్లు ఇస్తే చాలా ప్రాజెక్ట్ లు పూర్తి అవుతాయన్నారు. ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందుతుంది.ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.