AP Budget Session 2023: విశాఖపట్నం నగరాన్ని రాష్ట్ర పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో ప్రకటించారు రాష్ట్ర గవన్నర్ అబ్దుల్ నజీర్.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. విశాఖపట్నం కేంద్రంగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు (జీఐఎస్)లో మొత్తం రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబడులకు 378 ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు వెల్లడించారు.. 16 కీలక రంగాలలో 6 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఇంధన రంగంలో గణనీయమైన పెట్టుబడి రాబోతోంది.. రూ.9,57,112 కోట్ల పెట్టుబడులతో 1.80 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. ఇక, బలమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత, 974 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఏపీ సొంతం అని వెల్లడించారు.. సమృద్ధిగా ఉన్న ఖనిజ వనరులు మొదలైన స్వాభావిక ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందన్న ఆయన.. ప్రభావవంతమైన జోక్యాలు, మా ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సుపరిపాలన పద్దతులు ప్రశంసనీయ ఫలితాలను ఇస్తున్నాయంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Read Also: AP Budget Session 2023: నాలుగేళ్లుగా పారదర్శక పాలన..
రాష్ట్ర సమ్మిళిత, సుస్థిర ప్రగతి వైసీపీ ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యతలుగా కొనసాగుతాయని తెలిపారు గవన్నర్.. రాష్ట్రాన్ని మరింత పటిష్టంగా, శక్తివంతంగా చేయడానికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మేం నిరంతరం కృషి చేస్తాం అన్నారు. ఇక, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఋణాల పథకం ద్వారా లక్ష వరకు పంట ఋణాలకు సంబంధించి వడ్డీ సబ్సిడీని నేరుగా సకాలంలో ఋణ చెల్లింపు చేసిన రైతుల ఖాతాల్లో నేరుగా బదిలీ చేశామన్నారు.. ఇప్పటివరకు, గత బకాయిలతో సహా రూ.1,834.55 కోట్ల వడ్డీ సబ్సిడీని 73.88 లక్షల మంది రైతులకు విస్తరించబడ్డాయి.. వైఎస్ఆర్ జలకళ క్రింద, 18 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. రూ.2,340 కోట్ల ఆర్థిక వ్యయంతో నాలుగు సంవత్సరాల వ్యవధిలో రెండు లక్షల ఉచిత బోరు బావులను వేయడానికి ప్రణాళిక రూపొందించబడిందని ప్రకటించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.188.84 కోట్ల వ్యయంతో ఇప్పటి వరకు 6,931 బోరు బావులను తవ్వడం జరిగింది.. దీని ద్వారా 9,629 మంది లబ్ధిదారుల ప్రయోజనం పొందారని వివరించారు. పోలవరం, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులు, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని అసెంబ్లీ ప్రకటించిన గవర్నర్.. 54 జలయజ్ఞం నీటిపారుదల ప్రాజెక్టులలో 14 ప్రాజెక్టులు పూర్తి కాగా, 2 పాక్షికంగా పూర్తయ్యాయన్నారు.. రాబోయే 4 సంవత్సరాలలో దశల వారీగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని.. కాలువ పనులతో పాటుగా ప్రధాన డ్యామ్ లో 79.07 శాతం వరకు పనుల పూర్తి చేశామని తెలిపారు గవర్నర్ అబ్దుల్ నజీర్.