త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. విశాఖలో హాయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు రెండవ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో 30 మంది విద్యా సంస్థల డైరెక్టర్లు, వీసీలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ప్లానింగ్ బోర్డు లేదు… మన రాష్ట్రంలోనే ఉందని గుర్తుచేశారు.. విద్యాశాఖ కిందకు రాని వెటర్నరీ, అగ్రికల్చర్, మెడికల్ యూనివర్సిటీలను ఒకే గొడుగు కిందకు తెచ్చామని.. మౌలిక వసతులు, మానవవనరులు ఎక్స్చేంజి ప్లానింగ్ బోర్డు ద్వారా సాధ్యం అయ్యిందని వెల్లడించారు.. విద్యలో నాణ్యత ప్రమాణాలు, ఉన్నత విద్య విస్తృతిపై చర్చించినట్టు తెలిపారు. విద్యకు పేదరికం అడ్డుకారాదు.. విద్యను వ్యాపారం చేయకూడదనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
ఇక, సంస్కరణలకు శ్రీకారం చుట్టాము ఆ ఫలితాలు రెండేళ్లలో వస్తాయని వెల్లడించారు మంత్రి.. విద్య, సంక్షేమంపై 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్న ఆయన.. పాత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 2200 కోట్లు ఫీజురీయింబర్స్‌మెంట్ మా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు.. మరోవైపు.. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు మేం వ్యతిరేకం కాదన్న మంత్రి ఆదిమూలపు సురేష్.. ప్రైవేట్ యూనివర్సిటీలపై ఆచితూచి అడుగులు వేస్తున్నాం అన్నారు.. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు లోబడితే అనుమతిస్తామని స్పష్టం చేశారు.. త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ… 2500 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని.. బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. యూనివర్సిటీలో అధ్యాపకుల ఖాళీలను పూర్తి చేస్తామని ప్రకటించారు. స్టూడెంట్, టీచర్ రేషియోకు అనుగుణంగా నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.