రహదారులు, భవనాల శాఖతో పాటు విశాఖ బీచ్ కారిడార్ పనుల పురోగతి పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. రహదారుల భద్రత కోసం ఒక లీడ్ ఏజెన్సీను ఏర్పాటు చేయటానికి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. దీనిలో పోలీసు, ట్రాన్స్‌పోర్ట్, హెల్త్, రోడ్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి నిపుణులు ఉంటారు. రోడ్ సేఫ్టీ ఫండ్ ఏర్పాటుకూ సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. మరోవైపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వం సంయుక్తంగా ఒక డ్రైవింగ్ స్కూలు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ స్కూళ్ళల్లో ఉండే సదుపాయాలు ఆర్టీసీ వినియోగించుకోవడంతో పాటు, డ్రైవింగ్ శిక్షణ కోసం కూడా ఉపయోగపడతాయన్నది ప్రభుత్వ ఆలోచన. కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాకు ఒక ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
రోడ్ల పై లేన్ మార్కింగ్ విధానంలో మార్పులు చేయనున్నారు. మార్కింగ్ స్పష్టంగా కనిపించే విధంగా చర్యలు తీసుకోవటంతో పాటు బైక్‌లు, ఫోర్‌వీల్ వాహనాలకు ప్రత్యేక లేన్స్ ఏర్పాటు పై ఆలోచన చేయాలని సీఎమ్ సూచించారు. స్పీడ్ పరిమితిని తెలిపే సైన్ బోర్డుల ఏర్పాటు వల్ల ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుందన్నారు సీఎం. రోడ్ల పక్కన డాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలన్నారు సీఎం. గత ప్రభుత్వం హయాంలో రహదారుల నిర్వహణను పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. ఈ ప్రభుత్వం హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్టుగా విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు జగన్. విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి, భోగాపురం తిరిగి ఎన్‌హెచ్ 16కు అనుసంధానం అయ్యే బీచ్‌కారిడార్ రోడ్డు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు నివేదించారు. రోడ్డు డిజైన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు సీఎం జగన్. ఈ బీచ్ కారిడార్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలవాలన్నారు సీఎం.