కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంతో.. సీఎం సొంత జిల్లా కడపలోని బద్వేల్ నియోజకవర్గంవైపు ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది.. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సుధను ప్రకటించింది. ఇక, బద్వేల్ ఉప ఎన్నికలపై కసరత్తు ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.. రేపు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలవనున్నారు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ, అభ్యర్థి సుధతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్‌రెడ్డి.. ఉప ఎన్నికపై నేతలకు బాధ్యతలు, ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు వైసీపీ అధినేత.
కాగా, బద్వేల్ బై పోల్‌కు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలవుతుంది.. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటిస్తారు. బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. షెడ్యూల్ రావడంతో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది.