Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా సచివాలయాల్లో మెరుగైన పనితీరు, సమగ్ర పర్యవేక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో సచివాలయాల కీలక పాత్ర, సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీల భర్తీ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేశామని సీఎం జగన్ అన్నారు. చివరి స్థాయి వరకూ సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలని.. సరైన ఎస్‌ఓపీలు, పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదన్నారు. సిబ్బంది హాజరు దగ్గరనుంచి అన్నిరకాలుగా పర్యవేక్షణ ఉండాలని.. గ్రామ, వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటల వరకు స్పందన నిర్వహించాలని సీఎం జగన్ అన్నారు.
Read Also: Chandrababu: నేను తలుచుకుంటే ఆనాడు జగన్ పాదయాత్ర చేసేవాడా?
మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని మంచి పేరు వచ్చిందని.. మళ్లీ ఎలాంటి లోపం లేకుండా సమర్థవంతంగా నియామక ప్రక్రియను చేపట్టాలని సూచించారు. అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు కల్లా సచివాలయం నుంచి గ్రామస్థాయి సచివాలయం వరకు కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు అమలు చేయాలని సీఎం జగన్ అన్నారు. అన్ని గ్రామ సచివాలయాలను వైర్డ్ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వైర్‌లెస్ ఇంటర్నెట్‌తో నడుస్తున్న 2,909 గ్రామ సచివాలయాలను వైర్డ్ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాలని అధికారులకు చెప్పారు. గ్రామంలోని ఆర్బీకేలు, విలేజ్ సెక్రటేరియట్స్‌లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సీఎం అన్నారు. అటు అంగన్‌వాడీలను కూడా సచివాలయాల పర్యవేక్షణలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.