Anakapalli: మొంథా తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో వందల ఎకరాల వరి పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శారదా నది ఉప్పొంగడంతో యలమంచిలి నియోజకవర్గం ఎక్కువగా ప్రభావితమైంది. ఇక, ఈ వరదతో రాంబిల్లి మండలం రజాల గ్రామం మొత్తం నీట మునిగిపోయింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పంట వెన్ను వేసే సమయంలో శారదా నదికి గండి పడటంతో పంటలను వరద నీరు నిండా ముంచేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ రోజులు నీటిలో నానితే పంట మొత్తం కుళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. అలాగే, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రాత్రంతా జాగారం చేశామని, ఇంత పెద్ద వరద ముప్పును ముందెన్నడూ చూడలేదని రైతులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ టూ-వీలర్లపై ప్రభావిత వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
Read Also: Black Spots: నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలు తింటున్నారా.. అయితే బీకేర్ ఫుల్
మరోవైపు, అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం కొత్తూరు సమీపంలో శారదా నది ఒడ్డున పామాయిల్ తోటలో ఓ కుటుంబం వరదలో చిక్కుకుపోయింది. తోటను వరద నీరు చుట్టుముట్టడంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ బృందాలు.. బాధితులను బయటికి తీసుకొచ్చాయి. అనంతరం సురక్షిత ప్రాంతానికి వారిని తరలించారు. స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను దగ్గరుండి మరీ పరిశీలించారు.