Bus Driver Saves 50 Students:ఏకంగా 50 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడి.. తనువు చాలించాడు ఓ స్కూల్ బస్సు డ్రైవర్.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సెంటర్‌లో ఈ రోజు ఉదయం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్ దెందుకూరి నారాయణరాజు (60) తన కర్తవ్య నిర్వహణలో విద్యార్థుల ప్రాణాలను కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: Kangana Ranaut : రాజకీయాలు లేదా సినిమాలు? కంగనా క్లారిటీ ఇచ్చేసిందిగా
ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన నారాయణరాజు ప్రతి రోజు మాదిరిగానే విద్యార్థులను కళాశాలకు తీసుకెళ్తుండగా, మడికి వద్ద జాతీయ రహదారి 216ఏపై ప్రయాణిస్తున్న సమయంలో గుండెపోటు వచ్చింది. ఒక్కసారిగా అస్వస్థతకు గురైన ఆయన, అప్రమత్తంగా బస్సును రోడ్డు మధ్యలో ఆపి, కిందకు దిగి రోడ్డు డివైడర్‌పై కుప్పకూలిపోయాడు. బస్సులో ఉన్న విద్యార్థులు వెంటనే విషయం తెలుసుకుని హైవే పెట్రోలింగ్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు క్షణాల్లో చేరుకుని డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే నారాయణరాజు మృతిచెందారు. తన చివరి క్షణాల్లో కూడా బస్సులో ఉన్న 50 మంది విద్యార్థులను రక్షించిన నారాయణరాజు నిజమైన హీరోగా నిలిచిపోయాడు. తనను తాను త్యాగం చేసి 50 మందిని కాపాడాడు అంటూ స్థానికులు, విద్యార్థులు భావోద్వేగానికి గురవుతున్నారు. తమతో ఎంతో అనుబంధంగా మెలిగిన డ్రైవర్ నారాయణరాజు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడం విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.