Ambati Rayudu Reveals Secret Behind Meeting With CM Jagan: ఇటీవల తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో అంబటి రాయుడు భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారని.. వైసీపీ పార్టీలో చేరడం ఖాయమని వార్తలు రావడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం జగన్‌తో భేటీ వెనుక గల అసలు సీక్రెట్ ఏంటో రివీల్ చేశాడు. తాను కేవలం స్పోర్ట్స్ గురించి మాట్లాడేందుకు సీఎంని కలిశానని స్పష్టం చేశాడు. రాష్ట్రంలో అకాడమీలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారని.. తాను కూడా క్రీడారంగంలో తనవంతు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు.
CM YS Jagan: జులై 4న సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
ఇటీవలే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు.. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించాడు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించాడు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం బాటలు వేస్తోందని.. విద్యారంగంలో జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మంచి మార్పులు తీసుకువచ్చిందని కొనియాడాడు. పాఠశాలల విషయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బాగున్నాయన్నాడు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను పరిశీలించానని, అన్ని ప్రాంతాలు తిరిగి విషయాలు తెలుసుకుంటున్నానని తెలిపాడు. రైతులందరూ ప్రభుత్వపరంగా తమకు మంచి మద్దతు అందుతుందని, రైతు భరోసా కేంద్రాలు బాగా ఉపయోగపడుతున్నాయని రైతులు చెబుతున్నారని అన్నాడు. ప్రజలకు సేవ చేయాలని తన తాత దగ్గర నుంచి నేర్చుకున్నానని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.
కాగా.. అంతకుముందు సీఎం జగన్‌తో భేటీ అయినప్పుడు, ట్విటర్ మాధ్యమంగా అంబటి రాయుడు సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించాడు. రాష్ట్ర యువత కోసం పటిష్టమైన కార్యక్రమాన్ని రూపొందిస్తోందని తెలిపాడు. ‘‘గౌరవనీయులైన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు రూపా మేడమ్, సీఎస్కే మేనేజ్‌మెంట్‌తో కలవడం జరిగింది. ఈ భేటీలో వారితో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, వెనుకబడిన వారికి విద్యపై చర్చించాం. మన రాష్ట్ర యువత కోసం ప్రభుత్వం పటిష్టమైన కార్యక్రమాన్ని రూపొందిస్తోంది’’ అంటూ ట్వీట్ చేస్తూ.. సీఎం జగన్‌తో కలిసిన ఫోటోనూ షేర్ చేశాడు.