Ambati Rambabu : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రభుత్వ విధానాలు, దేవాలయాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంబటి రాంబాబు మాట్లాడుతూ, తిరుమలలో 1985 నుంచి భక్తులకు ఉచిత భోజనం అందిస్తున్నారని, ఇందుకోసం భక్తులు 27 వేల కోట్లకు పైగా విరాళాలు సమకూర్చారని తెలిపారు. “నేను అక్కడ భోజనం చేసినప్పుడు, భోజనం బాగుందని మాత్రమే చెప్పాను. దాన్ని కూడా రాజకీయంగా మలచటం చంద్రబాబు స్టైల్,” అని ఆయన వ్యాఖ్యానించారు. దేవుడిని రాజకీయాలకు వాడటం వాళ్లకు అలవాటు అని, లడ్డూ ప్రసాదం విషయాన్ని చంద్రబాబు రాజకీయ రంగంలోకి లాగారంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. పేదలకు మెరుగైన వైద్యం అందించడం, పేద విద్యార్థులు డాక్టర్లు కావడానికి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ఆలోచనతో ముందుకు సాగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. “మెడికల్ కాలేజీలను అమ్మేసి లోకేష్ జేబులు నింపాలనేది చంద్రబాబు ఉద్దేశం,” అని ఆరోపించారు.
వైసీపీ నేతలపై బురద చల్లడానికి చంద్రబాబు తన ఆధీనంలో ఉన్న మీడియాను వినియోగిస్తున్నారని కూడా అంబటి విమర్శించారు. “ముందుగా మీడియా కథనాలు రాయిస్తుంది. ఆ తర్వాత సిట్ వేసి, ఎవరో ఒకరిని తీసుకువచ్చి వైసీపీ నేతలపై స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. ఇలా అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తారు,” అని ఆరోపించారు.