PM Modi Condoles: తెలంగాణ రాష్ట్రంలో పుట్టి, తన అద్భుతమైన సాహిత్యం ద్వారా ప్రజా కవిగా పేరొందిన డాక్టర్ అందెశ్రీ నేడు ఉదయం కన్నుమూశారు. జనగాం జిల్లా, మద్దూరు మండలం, రేబర్తి గ్రామంలో అందె ఎల్లయ్య అనే అసలు పేరుతో జన్మించిన ఆయన జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అందెశ్రీ అనాథగా పెరిగారు.. కనీసం చదువుకునే అవకాశం కూడా ఆయనకు దక్కలేదు. ఆయన జీవితం మొదట్లో గోడ్ల కాపరిగా ప్రారంభమైంది. అయితే, ఒకరోజు ఆయన పాడుతుండగా విన్న శృంగేరి మఠానికి చెందిన స్వామీ శంకర్ మహారాజ్ చేరదీయడంతో అతడి జీవితంలో కీలక మలుపు తిరిగింది. చదువుకోకపోయినా, ఆయన కవిత్వ ప్రతిభను గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటును అందించింది. ఇక, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవిగా అందెశ్రీ కీలక పాత్రను పోషించారు. ఆయన కేవలం పాటలకే పరిమితం కాకుండా.. తెలంగాణ ధూం ధాం కార్యక్రమ రూపశిల్పిగా 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ప్రజాకవి అందెశ్రీ తన పాటల ద్వారా తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు.
అందెశ్రీ మరణం పట్ల దేశ ప్రధానితో సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి తమ ట్వీట్‌లో.. అందెశ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు, అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు… ఆయన సామాజిక స్పృహను, సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం అని ప్రధాని కొనియాడారు. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ “ఓం శాంతి” అని ముగించారు.
Asim Munir: దాయాది దేశంలో నిశ్శబ్ద తిరుగుబాటు.. జనరల్ జియా అడుగుజాడల్లో మునీర్!
ఇక మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సంతాపం: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సంతాపం తెలుపుతూ.. అందెశ్రీ మరణం తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య రంగంలో లోటును మిగిల్చిందని అన్నారు. పేదల పక్షాన, అట్టడుగు వర్గాల పక్షాన నిలబడిన నేల బిడ్డ, ప్రతిభావంతుడైన కవి అయిన ఆయన మాటలు తెలంగాణ ఉద్యమానికి గుండె చప్పుడుగా మారాయి. “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” పాట ద్వారా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ ప్రతిధ్వనించే రాష్ట్ర గీతాన్ని ఆయన అందించారని ఖర్గే నివాళులు అర్పించారు.