YS Jagan: ప్రతీ చర్యకు.. ప్రతిచర్య ఉంటుంది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతాడే, అంతే వేగంతో అదిపైకి లేస్తుందన్నారు.. ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని.. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారని హెచ్చరించారు.. ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన వైఎస్ జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ, తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చే తీర్పులు చూశాం. ఈ పక్కన ప్రజలు తంతే.. ఆ పక్కన పడతారు. చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు. మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలో 10 కి 9 చోట్ల గెలిచాం. మరి అక్కడ గెలవాల్సింది వైసీపీ కదా? అని ప్రశ్నించారు జగన్.. అక్కడ ఎన్నికను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలకు భద్రత ఇవ్వాల్సింది పోయి, పోలీసులే ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు చేశారు. రామగిరి ఎస్సై, ఎంపీటీసీల వాహనం ఎక్కాడు. వీడియో కాల్‌లో ఎమ్మెల్యేతోనూ, ఎమ్మెల్యే కుమారుడితోనూ బెదిరించారు. టీడీపీకి అనుకూలంగా ఓటేయమని బెదిరించారు. మన పార్టీ ఎంపీటీసీలు ఎన్నిక సమయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వేరే మండల కేంద్రానికి తీసుకెళ్లి బైండోవర్ చేసే కార్యక్రమం చేశారు. దీనికి వ్యతిరేకంగా ధర్నాచేస్తే మన పార్టీ జిల్లా అధ్యక్షురాలు మీద, ఇన్‌ఛార్జి మీద కేసులు పెట్టారు.. దీని తర్వాత మన పార్టీ తరఫున యాక్టివ్‌గా ఉన్న లింగమయ్యను హత్యచేశారు. ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది..? చంద్రబాబు ప్రజలకు మంచి చేయొచ్చు కదా? ఇచ్చిన హామీలను నెరవేర్చొచ్చు కదా? ఇంతలా దిగజారిపోవాల్సిన అవసరం ఉందా? అంటూ మండిపడ్డారు జగన్..
Read Also: Ampere Reo 80: మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ ధర.. సూపర్ ఫీచర్లు
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోంది. అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రతి గ్రామంలోనూ మద్యం షాపులు, బెల్టుషాపులు. పేకాట క్లబ్బలు, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలు నడుస్తున్నాయి. వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్.. అయితే, ఈ సమయంలో ప్రజల తరఫున కేడర్ నిలవాలి. చంద్రబాబు పాలనలో ఆరు నెలలు తిరక్కముందే ప్రజలకు తోడుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల తరఫున పోరుబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ శ్రేణులు, నాయకులు కలిసికట్టుగా నిలవాలి. ప్రజలకు తోడుగా నిలవాలి. గ్రామస్థాయి నుంచి వ్యవస్థీకృతంగా పార్టీ ఉండాలి. ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా నిలవాలని సూచించారు.. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణ పరిస్థితులు వచ్చాయి.. తనకు సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తనకే కావాలని చంద్రబాబు అధికార అహంకారం చూపుతున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికలు మొన్ననే 57 చోట్ల జరిగాయి. చంద్రబాబుకు గెలిచే వాతావరణం లేక 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. 50 చోట్ల ఎన్నిక జరిగితే 39 చోట్ల వైయస్సార్‌సీపీ గెలిచిందని వివరించారు.. పార్టీ శ్రేణులు, నాయకులు తెగింపుతో గట్టిగా నిలబడి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు మన పార్టీ కేడర్‌ను ఏమీ చేయలేకపోయారు. అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది. అలాంటి చోట్ల బలం లేకపోయినా చంద్రబాబు అధికార అహంకారం చూపారు. పోలీసులను వాచ్‌మెన్లకంటే ఘోరంగా వాడుకున్నారని ఫైర్ అయ్యారు..
Read Also: PM Modi: రేపు వారణాసిలో మోడీ పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన
అసలు చంద్రబాబు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించిన జగన్.. ఎందుకంటే వైసీపీ అంటే చంద్రబాబు భయం. వైసీపీ కార్యకర్త అంటే చంద్రబాబుకు భయం అని విమర్శించారు.. చంద్రబాబు హామీల అమల్లో, పాలనలో ఘోరంగా విఫలమయ్యారు. టీడీపీ కేడర్, నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రజలకు దగ్గరకు వెళ్తే కచ్చితంగా నిలదీస్తారు. ప్రజలు ప్రశ్నిస్తారని చంద్రబాబుగారు, ఆయన పార్టీ ఇలాంటి దారుణాలకు దిగుతోంది. ప్రశ్నించే స్వరం ఉండకూడదని, రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. రాష్ట్రం పూర్వపు బీహార్ రాష్ట్రంలా తయారయ్యిందని ఆరోపించారు.. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం యుద్ధం చేస్తున్నాం. కష్టాలు అనేవి శాశ్వతంగా ఉండవు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలబడాలి. మన పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈసారి జగన్ 2.O పాలన కచ్చితంగా మీరు చూస్తారు. ప్రతి కార్యకర్తకు జగన్ భరోసాగా ఉంటాడు. విలువలు, విశ్వసనీయతకు దర్పణంలా పార్టీని నిలుపుదామని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..