Ambati Rambabu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ నివేదిక వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనం పాటించడంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. సిట్ రిపోర్టు వచ్చాక ఇంతవరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మిన నీచులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటూ అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పూర్తిగా చెంచాగా మారిపోయారని, సొంత పార్టీ నడుపుతున్నానన్న సంగతే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగేలా వీరిద్దరూ వ్యవహరించారని ఆరోపించారు.
లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా జంతువుల కొవ్వు ఉందంటూ పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇలాంటి విష ప్రచారం చేయడం ధర్మమా అని ప్రశ్నించారు అంబటి.. అసలు శాంపిల్స్ తీసిన ట్యాంకర్లు కూటమి ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని, చంద్రబాబు సీఎం అయిన నెల రోజుల తర్వాత వచ్చిన ట్యాంకర్లలోనే శాంపిల్స్ తీసినట్లు ల్యాబ్ రిపోర్టులు స్పష్టంగా చెబుతున్నాయని అంబటి తెలిపారు. వాటిల్లో జంతువుల కొవ్వు కలవలేదని నివేదికలు తేల్చినా, వైసీపీపై నిందలు వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో వాస్తవాలేంటో సీబీఐ తేల్చిందని, అయినప్పటికీ తప్పుడు ప్రచారాలు ఆపడం లేదని మండిపడ్డారు. హర్ష్ డెయిరీ పేరుతో బోలేబాబా ఎంటరైనది కూడా చంద్రబాబు హయాంలోనేనని గుర్తు చేశారు.
వైవీ సుబ్బారెడ్డి తప్పు చేసి ఉంటే ఆయన పేరు ఛార్జిషీట్‌లో ఎందుకు లేదని ప్రశ్నించారు అంబటి.. చంద్రబాబుకు ఇప్పటికీ బుద్ధి రాలేదని, లడ్డూకి పంగనామాలు పెట్టి మార్ఫింగ్ ఫోటోలు సృష్టించారని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్ కొండ మీద కూర్చుని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, కొందరు అధికారులు కూడా దైవం దగ్గర అపచారానికి పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. శ్యామలరావు, వెంకన్న చౌదరి లాంటి వారికి తగిన గుణపాఠం చెప్పే సమయం దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. చంద్రబాబు మోజేతి నీళ్లు తాగుతూ ఇష్టానుసారం వ్యవహరించే వారిని వదిలిపెట్టేదే లేదని అన్నారు. లడ్డూ వ్యవహారంలో ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయాయని, సిట్ రిపోర్టు వచ్చిన తర్వాత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వాళ్ల నోర్లు ఎందుకు మూత పడ్డాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ నిజమైన రాజకీయ నాయకుడిగా మారితేనే మంచిదని హితవు పలికారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు..