YS Jagan: సీఎం చంద్రబాబుపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతున్నారు అని పేర్కొన్నారు. వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి నేను ప్రకాశం జిల్లాలోని పొదిలికి వెళ్తే.. ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? అని ప్రశ్నించారు. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేల మంది రైతులు, ప్రజలు తరలి వచ్చారు.. మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు అని ఆరోపించారు. కానీ, ప్రజలు- రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు అని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Telangana Govt: గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు మంజూరు..
ఇక, హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన, అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబు? అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా? అని మండిపడ్డారు. పైగా ఉల్టా రాళ్లు మీ వాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు? అని క్వశ్చన్ చేశారు. రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.