Nara Lokesh: టీడీపీ అనేది ఒక వ్యక్తికి పరిమితం కాని పార్టీ అని, కార్యకర్తలే నిజమైన అధినేతలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్లమెంటరీ కమిటీలకు నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, పార్టీనే అందరికీ అధినాయకత్వం అని పేర్కొన్నారు. పార్టీలో యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని లోకేష్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు కూడా పొలిట్ బ్యూరో స్థాయికి ఎదిగేలా సంస్కరణలు చేపట్టామని తెలిపారు. పేదరికం లేని సమాజం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యంగా అన్నదాతకు అండగా నిలుస్తోందని చెప్పారు. రైతుకు కష్టం వస్తే ముందుండి పోరాడాల్సిందేనని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Read Also: Paris Hindu Temple: ఫ్రాన్స్‌లో మొట్టమొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన..
అన్ని పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని, జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. మహిళలకు 33 శాతం పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని, పార్టీలో మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు లోకేష్. పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారికే కమిటీల్లో బాధ్యతలు అప్పగించామని, పార్లమెంటరీ కమిటీల్లో 83 శాతం మంది కొత్తవారికి తొలిసారి అవకాశం కల్పించామని లోకేష్ తెలిపారు. అంజిరెడ్డి, మంజులా, తోట చంద్రయ్య వంటి కార్యకర్తలు అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. “మడమ తిప్పటం, మాట మార్చటం తెలుగుదేశం రక్తంలోనే లేదు” అని పేర్కొన్న లోకేష్, సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని అన్నారు. ప్రజలకు సేవ చేయడం, కార్యకర్తలకు సాయం చేయడం కోసం నిరంతరం తపించే నాయకుడు చంద్రబాబు నాయుడని ప్రశంసించారు. సేనాధిపతి చంద్రబాబు నేతృత్వంలో మనమంతా ఆయన సైనికులమని పేర్కొన్న లోకేష్, చేసిన పనులను ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు మంత్రి నారా లోకేష్..