Smart Family Card : ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ ఇవ్వనుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్… ప్రభుత్వ పథకాలతో పాటు సమగ్ర సమాచారం ఈ కార్డ్ లో ఉండనుంది.. వచ్చే జూన్ కు క్యూఆర్ కోడ్ తో కార్డ్ అందిస్తారు .. రేషన్, వాక్సినేషన్, ఆధార్, కుల ధ్రువీకరణ ఇలా అన్ని ఈ కార్డ్ నుంచి ట్రాకింగ్ జరగనుంది. సులభంగా పౌర సేవలు అందివ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్ పై సమీక్ష నిర్వహించారు.. 2026 జనవరికి పూర్తి సమాచారంతో కార్డులను తయారు చేసి జూన్ వరకు పంపిణీ చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు..
కుటుంబ సమగ్ర సమాచారంతో ‘స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్’ రూపొందించనున్నారు.. రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) డేటా లేక్ ద్వారా కుటుంబ, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించనున్నారు.. ప్రభుత్వ పథకాల పంపిణీ, పౌర సేవల పర్యవేక్షణకు ఒకే కార్డు పరిగణనలోకి తీసుకోనున్నారు. రాష్ట్రంలో కుటుంబ ప్రయోజనాల నిర్వహణ వ్యవస్థ (Family Benefit Management System – FBMS) అమలు పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన కీలక సూచనలు చేశారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేయాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. కుటుంబ సాధికారత లక్ష్యంగా ఈ వ్యవస్థను వినియోగించాలి.. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలు, పౌర సేవలు, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న డేటాను సమగ్రంగా సమీకరించి పర్యవేక్షించాలని.. దీనికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు..
స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ముఖ్య ఉద్దేశం..
* రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి QR కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డులు అందించాలి.
* ఇందులో 25 రకాల కీలక వివరాలు, P4 వంటి అంశాలు ఉంటాయి.
* RTGS డేటా లేక్‌ను ప్రామాణిక డేటాగా ఉపయోగించి ఇతర శాఖల సేవలకు అనుసంధానం చేయాలి.
* స్టాటిక్ (శాశ్వత) డేటా, డైనమిక్ (మారుతున్న) డేటా రెండింటినీ రిజిస్టర్ చేసే విధంగా వ్యవస్థ ఉండాలి.
కార్డులో నమోదు చేయబడే ముఖ్య వివరాలు..
* ఆధార్
* FBMS ID
* రేషన్ కార్డు
* కుల ధృవీకరణ
* వాక్సినేషన్ రికార్డు
* స్కాలర్‌షిప్
* పెన్షన్లు
* పౌష్టికాహారం
* ఇతర ప్రభుత్వ పథకాల అర్హత మరియు లబ్ధి వివరాలు
ఈ కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి సంబంధించిన అన్ని సేవలు, పథకాల వివరాలను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయగలుగుతారు. అర్హులైన ప్రతి పౌరునికి సులభంగా, పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించడం.. లబ్ధిదారుల ఎంపికలో ఎదురవుతున్న సమస్యలను పూర్తిగా అధిగమించడం లక్ష్యంగా పెట్టుకుంది కూటమి సర్కార్.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్స్ ద్వారా వివరాలు అప్‌డేట్ చేయనున్నారు.. 2026 జనవరి నాటికి రాష్ట్రంలోని మొత్తం కుటుంబ సమాచార సేకరణ పూర్తి చేయనున్నారు.. జూన్‌లోగా కార్డుల పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లు, ఒక్కటే కార్డు ద్వారా ఆధార్ సహా పౌరుల వ్యక్తిగత సమాచారం, పథకాల హక్కులు, సేవలు అన్నీ తెలిసేలా స్మార్ట్ ఫ్యామిలీ కార్డు రూపొందించబడుతుంది.