Perni Nani: కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ పెరిగిందని రెండు గంటల పాటు చెప్పి, మిగతా సమయం మొత్తం జగన్ ప్రభుత్వాన్నే తప్పుపట్టడమే చంద్రబాబు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని చెప్పడం హాస్యాస్పదమని, అసలు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అసలు బ్రాండ్ వ్యవసాయమేనని, దేశానికి దక్షిణ ధాన్యాగారంగా నిలిచిన రాష్ట్రాన్ని నాశనం చేసింది చంద్రబాబే అని పేర్ని నాని ఆరోపించారు. రైతు హితానికి అండగా నిలవాల్సిన ప్రభుత్వాన్ని, చంద్రబాబు గద్దెనెక్కినప్పటి నుంచి రైతు వ్యతిరేక దృక్పథమే నడుస్తోందని ఆయన విమర్శించారు.
పచ్చదగా కోరుగా వైసీపీ 10 లక్షల కోట్లు అప్పులు చేసిందని చంద్రబాబు చెప్పడం అబద్ధమని, అసెంబ్లీలో మాత్రం 3.33 వేల కోట్లు అన్నారని, ఎన్నికల సమయంలో మాత్రం 14 లక్షల కోట్లు అంటారా? అని నాని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం 18 నెలల్లో 2.66 లక్షల కోట్లు అప్పు చేసిందని చంద్రబాబు చెప్పడం పూర్తిగా అసత్యమని ఆయన పేర్కొన్నారు.
అప్పుల ప్రభుత్వం ఎవరది? అని ప్రశ్నించారు పేర్ని నాని.. గత ప్రభుత్వ హయాంలోనే 1,941 కోట్ల ఆస్తులను మార్ట్ గేజ్ చేసి 25 వేల కోట్లు అప్పులు తెచ్చింది. టీడీపీ ప్రభుత్వమేనని నాని అన్నారు. భవిష్యత్ మైనింగ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి 9 వేల కోట్లు అప్పులు తెచ్చిన ప్రభుత్వానికి అప్పుల గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సంతకం, గవర్నర్ సంతకం లేకుండానే టీడీపీ ప్రభుత్వం అప్పులు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయని, ఇది ఎంత దారుణమో ప్రజలు తెలుసుకోవాలని నాని అన్నారు.
శ్వేతపత్రం ఇవ్వడానికి సిద్ధమా?
మీరు తెచ్చిన అప్పుల డబ్బు ఎక్కడ ఖర్చయిందో శ్వేతపత్రం ఇవ్వడానికి చంద్రబాబుకు ధైర్యం ఉందా? అని పేర్ని నాని సవాల్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం కష్టపడుతుంటే, టీడీపీ నాయకులు మాత్రం హెలికాప్టర్లు, విమానాల్లోనే తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత జీడీపీ 13.5 అని చంద్రబాబు చెప్పడం పూర్తిగా తప్పని, జగన్ పాలనలో 10.5 అని ఎలా లెక్కపెట్టారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు లెక్కలు కూర్చొని మాట్లాడుదామంటే సిద్ధంగా ఉన్నామన్నారు. రెండు సంవత్సరాల కోవిడ్ సమయంలో కూడా జగన్ ప్రభుత్వం దేశ సగటు కన్నా మంచి ప్రదర్శన ఇచ్చిందని పేర్కొన్నారు. పోర్టులు, మెడికల్ కళాశాలలు, గ్రామ సచివాలయాలు, అరుదైన స్థాయిలో ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్లు.. ఇలా ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు మాజీ మంత్రి పేర్ని నాని..