Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్‌ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..

Nadendla Manohar

Nadendla Manohar

Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో విజయాన్ని సాధించాలంటే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులకు సూచించారు. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండి, పార్టీ బలోపేతమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మనమంతా పవన్‌ కల్యాణ్‌ కోసమే పనిచేస్తున్నాం.. గ్రూప్‌ రాజకీయాలు వద్దు అని స్పష్టం చేశారు..

గత కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుకూల పరిస్థితులు లేకపోయినా జనసేన పార్టీ బలంగా నిలబడిందని ఆయన గుర్తు చేశారు. విజయవాడలో 39 డివిజన్లలో పోటీ చేసి సుమారు 50 వేల ఓట్లు సాధించడం పార్టీ బలానికి నిదర్శనమన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తల త్యాగాలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు మనోహర్‌.. రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ముందుగానే వ్యూహాత్మకంగా పనిచేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ కంటే వ్యక్తిగత నమ్మకం, ప్రజలతో అనుబంధానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకులకే ప్రజలు మద్దతు ఇస్తారని అన్నారు.

కేవలం కార్లలో తిరగడం, భారీ బ్యానర్లు ఏర్పాటు చేయడం వల్ల ఓట్లు రావని, ప్రజా సమస్యలపై స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేసినప్పుడే ప్రజల విశ్వాసం పొందగలమని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పార్టీ క్యాడర్‌ను కలుపుకొని సమిష్టిగా పనిచేయాలని సూచించారు. జనసేన నాయకులు, కార్యకర్తలందరూ పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. పార్టీ లోపల గ్రూప్ రాజకీయాలకు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేశారు.

ప్రస్తుతం జనసేన కూటమిలో భాగంగా ఉందని, అన్ని పదవులను ఒకేసారి ఆశించడం సరికాదని పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్‌.. కూటమిలోని ఇతర పార్టీలు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాయని, వారితో సమన్వయంతో పనిచేస్తూ జనసేనను క్రమంగా మరింత బలోపేతం చేయాలని సూచించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో జనసేన పార్టీ, పవన్ కల్యాణ్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రజల్లో వాస్తవాలను తీసుకెళ్లి పార్టీపై విశ్వాసాన్ని మరింత పెంచేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్‌..