Minister Atchannaidu: రాష్ట్రంలో విత్తన కొరత లేదు.. వైసీపీ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోకండి అంటూ వైఎస్ షర్మిలకు సూచించారు మంత్రి అచ్చెన్నాయుడు.. గత ఐదేళ్ల అన్న పాలనలో రైతుల బాధలు కనపడకపోవడం బాధాకరమన్న ఆయన.. రాజకీయాల కోసం అటు అన్న, ఇటు చెల్లెలు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.. ఇక, సాగర్ కుడి కాలువ ఆయకట్టు మాత్రమే కాదు రాష్ట్రంలో ఎక్కడా విత్తన కొరత లేదన్నది స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలో వరి పంట సాధారణ విస్తీర్ణం 42,095 హెక్టార్లు.. కానీ ఈ ఏడాది ఖరీఫ్ 50,000 హెక్టార్లలో వరి పంట సాగు అంచనా వేసి అందుకు 31,000 క్వింటాళ్ల విత్తనం జిల్లాలో ఏ.పి. సీడ్స్, ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిశీస్తే వాస్తవాలు తెలుస్తాయని, వైసీపీ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.
Read Also: Mahesh Babu : ఇదెక్కడి లుక్ మావా? తగలబెట్టేసేలా ఉంది!
గత ఐదేళ్ల మీ అన్న పాలనలో రైతుల బాధలు కనపడకపోవడం బాధాకరమని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు విత్తనాలు లేవు, ఎరువులు లేవు, బిందు సేద్యం లేదు, కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన ఉద్యాన రాయితీలూ లేవన్న అచ్చెన్నాయుడు.. ఆ సమయంలో షర్మిల.. అన్నయ్య పట్ల ఎటువంటి వ్యతిరేకతా, రైతుల పట్ల ఎటువంటి సానుకూలత చూపకపోవడం గమనార్హం అని దుయ్యబట్టారు. రైతుల కోసం తక్కువ కాల పరిమితి ఉన్న MTU-1224, MTU-1282, NLR-3354, NLR-3238, NLR-34449, KNM-733, KNM-1638 వంటి మేలైన రకాలు పల్నాడు జిల్లా ప్రాంతానికి అనుకూలమని వాటిని కూడా సిద్ధం చేశామని పేర్కొన్నారు. Jgl 384 రకం విత్తనాలు గత వైసీపీ ప్రభుత్వంలో 1600 క్వింటాళ్లు మాత్రమే అందిస్తే, రైతుల విజ్ఞప్తి మేరకు మేము ఈ ఏడాది 4500 క్వింటాళ్లు ఇప్పటికే పంపిణీ చేచేశామని, రైతుల కష్టాలు తెలుసు కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన స్థాయిలో విత్తనాలు అందుబాటులో ఉంచామని.. వరద ముంపు ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలు పంపిణీతో పాటు, రాయలసీమలో వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కూడా రాయితీపై విత్తనాలు అందిస్తున్నామని, గిరిజన ప్రాంతాల్లో 90 శాతం రాయితీపై విత్తనాలు అందిస్తున్నామని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.