Site icon NTV Telugu

Madanapalle Incident: మదనపల్లి ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్‌..

Anitha

Anitha

Madanapalle Incident: మదనపల్లిలో జరిగిన దారుణ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొంటూ, బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించి ముందుగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేశారని అనిత తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో ముద్దాయి డ్రగ్స్ లేదా గంజాయి సేవించలేదని, అయితే మితిమీరిన మద్యం సేవించినట్లు గుర్తించామని వెల్లడించారు. మొదట బాలిక అదృశ్యమై ఉండవచ్చని అనుకున్నామని, కానీ స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టి బాలిక మృతదేహాన్ని ఆమె ఇంటి ఎదురుగా గుర్తించారని తెలిపారు.

నిందితుడిని తమకు అప్పగించాలని స్థానికులు ఆందోళనకు దిగారని హోంమంత్రి చెప్పారు. అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉండటంతో, విచారణకు ఆటంకం కలగకుండా బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకి, నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అతడు బెయిల్‌పై బయటకు రాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇటువంటి ఘటనలపై తమ ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

కాగా, మదనపల్లిలో చిన్నారి హత్య కేసు ఉద్రిక్తతకు దారి తీసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తీసుకెళ్లేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను స్థానికులు అడ్డుకుంటూ ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని, లేకపోతే ఎన్‌కౌంటర్ చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్పీ సహా ఇతర పోలీసు అధికారులు స్థానికులతో చర్చలు జరిపారు.. ఆందోళన కారణంగా చెన్నై–ముంబై జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని కచ్చితంగా కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేస్తామంటూ కడప ఎస్పీ విశ్వనాధ్ స్థానికులకు వివరించే ప్రయత్నం చేస్తున్న స్థానికులు ఆందోళన విరమించక పోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Exit mobile version