Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక

Pawan Kalyan

Pawan Kalyan

Janasena Party: ఆంధ్రప్రదేశ్‌లో స్థానికల ఎన్నికల హడావిడి మొదలైంది.. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణకు సిద్ధమవుతోంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు స్థానిక ఎన్నికల వ్యూహం, కార్యాచరణపై చర్చించారు. 30 రోజుల పాటు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఎన్నికల వ్యూహం ఎలా ఉండాలనే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ నిర్ణయిస్తారని జనసేన నేతలు స్పష్టం చేశారు. యువత, మహిళల సాధికారతను పార్టీ ప్రధాన ప్రాధాన్య అంశాలుగా పేర్కొన్నారు. జన సైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు. ‘సిద్ధం’ అన్న వ్యక్తే ఇప్పుడు ‘యుద్ధం’ అంటున్నారని జనసేన నేతలు వ్యాఖ్యానించారు. యుద్ధానికి జనసేన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలాన్ని చూపించాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.

2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యవస్థలను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని జనసేనను లక్ష్యంగా చేసుకున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. అయినప్పటికీ అప్పటి పరిస్థితుల్లో జనసేన గణనీయమైన ఫలితాలు సాధించిందని గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో కూడా యుద్ధ వాతావరణంలో పోరాడిన జనసేనకు ప్రజల మద్దతు లభించిందని తెలిపారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన 2 జడ్పీటీసీలు, 177 ఎంపీటీసీలు, 1,209 సర్పంచులు, 1,576 ఉప సర్పంచులు, 4,456 వార్డు మెంబర్లను గెలుచుకుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. రాబోయే స్థానిక పోరులో మరింత బలంగా పనిచేసి పార్టీ సత్తా చాటాలని నిర్ణయించారు. ఇక, పవన్‌ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 2న జనసేన యువజన విభాగాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా భాగస్వాములను చేయడంతో పాటు, స్థానిక స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు.