Site icon NTV Telugu

Bolisetti Satyanarayana: బొలిశెట్టికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్న జనసేన.. ధన్యవాదాలు తెలిపిన సత్యనారాయణ..

Bolisetti Satyanarayana

Bolisetti Satyanarayana

Bolisetti Satyanarayana: బొలిశెట్టి సత్యనారాయణకు పార్టీతో ఇకపై ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది జనసేన పార్టీ.. ఆయన పదవుల నుంచి తప్పుకోవాలన్న అభ్యర్థనను పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అంగీకరించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇకపై బొలిశెట్టి సత్యనారాయణ నిర్వహించే కార్యక్రమాలకు జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొంది.. ఆయన స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకోవడంతో వెంటనే విముక్తి కల్పించినట్లు వెల్లడించింది.

జనసేనకు బొలిశెట్టి ధన్యవాదాలు
ఇక, జనసేన పార్టీ నిర్ణయంపై స్పందించిన మాజీ జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ.. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ మరియు మానవ హక్కుల కోసం మరింత చురుకుగా పనిచేయాలనే తన అభ్యర్థనను గౌరవించి, బాధ్యతల నుంచి విముక్తి కల్పించారని అన్నారు.. పార్టీతో అధికారికంగా దూరమైనప్పటికీ, సిద్ధాంత పరంగా అనుబంధం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ దిశగా పని చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణపై దృష్టి
కొల్లేరు సరస్సు రక్షణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణ, భూ వినియోగ మార్పిడి నియంత్రణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సత్యనారాయణ సూచించారు. పర్యావరణ ప్రభావ అంచనాలు లేకుండా జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకోవాలని కోరారు. పర్యావరణ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ అంశాల్లో చొరవ చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తంగా, బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ బాధ్యతల నుంచి వైదొలగినప్పటికీ, పర్యావరణ పరిరక్షణ దిశగా తన సేవలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

Exit mobile version