Perni Nani: మీకు పాలన చేతకాకపోతే దిగిపోయి వైఎస్ జగన్‌కు అప్పగించండి.. పాలన ఎలా చేయాలో చేసి చూపిస్తారు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని.. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలు.. కేక్ కట్ చేశారు.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రఫుల్లా, వరుదు కళ్యాణి, మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటమే లక్ష్యంగా జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేశారు.. ప్రజలు పాలకుల నుంచి ఏం కోరుకుంటున్నారనే విషయాలను పాదయాత్ర ద్వారా తెలుసుకున్న జగన్.. గొప్ప ఆశయంతో ఇదే రోజున ఎనిమిదేళ్ల క్రితం యాత్ర ప్రారంభించారు.. 3,548 కిలోమీటర్లు, 2,516 గ్రామాలు, 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలతో యాత్ర కొనసాగించారని గుర్తుచేశారు..
Read Also: SSMB29 : మహేష్ బాబు – రాజమౌళి మూవీ లాంచ్‌కి ఆల్ స్టార్ సెలబ్రేషన్ ప్లాన్?
ఇక, ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన తర్వాత రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు 151 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందనే విషయాన్ని గుర్తుశారు పేర్ని నాని.. ప్రజలు తమ గుండెల్లో ఉన్న బాధను పాదయాత్రలో జగన్ తెలుసుకున్నారు.. ఆర్థిక బాధలు తట్టుకోలేక చదువుకు దూరమై పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న వారిని చూసారు. కళ్లతో చూసి మనసుతో విన్నారు కాబట్టే దేశంలో ఏ ముఖ్యమంత్రి పనిచేయని విధంగా జగన్ పనిచేశారు.. రాష్ట్రంలో పేదరికం పోవాలంటే పేదవాడి ఇంట్లో పిల్లలు చదవాలని నమ్మిన వ్యక్తి ఆయన.. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చారని పేర్కొన్నారు. అయితే, ఇవాళ స్కూల్స్ ఖాళీ చేసి ప్రైవేట్ దారిపడుతున్నారని విమర్శించారు..
పేదవాడికి ఉచిత వైద్యం కోసం డాక్టర్ల కొరత తీర్చేందుకు 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలు మొదలుపెట్టారు.. కరోనా సమయం తీసేస్తే మూడేళ్లలో ఐదు కళాశాలలు పూర్తి చేశారు.. మరో రెండు సిద్ధం చేశారు అని పేర్కొన్నారు పేర్ని నాని.. వైఎస్ జగన్ సంకల్పం చంద్రబాబు కొనసాగించి ఉంటే అన్ని మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వచ్చేవి.. కానీ, రాష్ట్రంలో చంద్రబాబు రాక్షసపాలన చేస్తున్నారు.. ప్రజలను తిరిగి కష్టాల్లోకి నెట్టి వేస్తున్నారు.. పెత్తందారి మనస్తత్వంతో ప్రజలకు వైద్యం, విద్య దూరం చేస్తున్నారని మండిపడ్డారు.. ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారు.. జగన్ ఎక్కడకి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. జగన్ వెళ్తే వెళ్ళారు ఎవరి ప్రాణాలు తీయవద్దని లోకేష్ వెటకారంగా మాట్లాడుతున్నారు.. అసలు మీ పర్యటనల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మీకు గుర్తు లేదా..? మీ పాలనలో ఆలయాల్లో ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు.. ఇంతమంది ప్రాణాలు పోతే మీకు బాధ్యత లేదా..? ఆలయాల్లో చనిపోతే ప్రైవేటు గుడి అని చెప్పటానికి సిగ్గులేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్నినాని..