TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Leadership Conclave: ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర స్థూల అభివృద్ధిని నియోజకవర్గ స్థాయి అభివృద్ధితో అనుసంధానం చేయాలని అన్నారు. అమరావతిలో జరిగిన టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌లో సుస్థిర అభివృద్ధి, నీటి వనరులు, పెట్టుబడులు, ఉపాధి, మౌలిక వసతులు, నియోజకవర్గాల ఆర్థిక ప్రగతిపై ఆయన కీలకంగా మాట్లాడారు. ప్రతి ప్రాంతంలో అభివృద్ధి ఫలాలు కనిపించేలా ప్రణాళికలు రూపొందించాలని పార్టీ నాయకులకు సూచించారు. నియోజకవర్గాల గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌లో విజయవాడ సెంట్రల్, పాలకొల్లు, మండపేట, చిలకలూరిపేట, నెల్లూరు సిటీ, తణుకు ముందంజలో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర స్థాయి అభివృద్ధితో పాటు నియోజకవర్గాల ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని చెప్పారు. 15 నుంచి 20 రంగాల్లో జీడీపీ పెరిగేలా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ప్రజల్లో అభివృద్ధిపై సానుకూల అభిప్రాయం పెరగాలి
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చంద్రబాబు అన్నారు. విమర్శలను కూడా సానుకూలంగా మార్చుకుని ప్రజల మద్దతు కూడగట్టాలని సూచించారు. అభివృద్ధి ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవాలని, ఓటు వేసే అలవాటు లేని వారిలోనూ మార్పు తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Also Read
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్‌షాప్
డేటా సెంటర్లతో భారీగా ఉద్యోగాలు
రాష్ట్రానికి గూగుల్ వంటి సంస్థలు వచ్చినప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపోయాయని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో కొందరు వ్యక్తులు కుట్రలు చేస్తూ పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. డేటా సెంటర్లకు అవసరమైన 5 టీఎంసీల నీరు పెద్ద సమస్య కాదని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు దాదాపు 2 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉందన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీ మొత్తంలో ఉద్యోగాలు, లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని అన్నారు.
రూ.20.35 లక్షల కోట్ల జీఎస్డీపీ
2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లుగా ఉందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం ఆర్థికంగా ఎదిగేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విజయగాథలను సృష్టించుకోవాలని సూచించారు.
నీటి వనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టి
ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఏడాది గోదావరి నుంచి సుమారు 1,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని చంద్రబాబు తెలిపారు. అందులో కనీసం 300 టీఎంసీలను వినియోగించుకున్నా రాష్ట్ర పరిస్థితుల్లో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని అన్నారు. మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు. పుష్కరాలకంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వంశధార, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, కావేరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లను నింపుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
ప్రాజెక్టులు పూర్తయితే 1,400 టీఎంసీల నిల్వ
వెలిగొండలో ఈ సీజన్లో 10.7 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నామని, వచ్చే ఏడాది 50 టీఎంసీల వరకు నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. పోలవరం ఫేజ్-2 పూర్తయితే 190 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చని, బొల్లాపల్లి ప్రాజెక్టు నిర్మిస్తే ఈ సామర్థ్యం 350 టీఎంసీలకు చేరుతుందని చెప్పారు. కడప జిల్లాలోని ప్రాజెక్టులతో దాదాపు 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాలు ఉన్నాయని గుర్తుచేశారు. అన్ని ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 1,250 నుంచి 1,400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని, ఇది రాష్ట్ర చరిత్రను మార్చే స్థాయిలో ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.
భూగర్భ జలాల పెంపుపైనా దృష్టి
నదుల ద్వారా బయట నుంచి నీటిని తీసుకురావడం ఎంత ముఖ్యమో.. రాష్ట్రంలో కురిసే వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడం కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. భూగర్భ జలాలు పెరిగితే వ్యవసాయానికి విద్యుత్‌పై ప్రభుత్వం చేసే సబ్సిడీ వ్యయం తగ్గుతుందని, ట్రాన్స్మిషన్ ఖర్చులు కూడా తగ్గుతాయని వివరించారు.
మౌలిక వసతులపై ప్రత్యేక ప్రణాళిక
గత 30 ఏళ్లలో దేశంలో ఊహించని స్థాయిలో మార్పులు వచ్చాయని చంద్రబాబు అన్నారు. దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన హైవేలు రాష్ట్రంలో నిర్మిస్తున్నామని, పోర్టులు, ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఇరిగేషన్‌ను తీసుకొచ్చింది కూడా తమ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. వెల్త్ క్రియేట్ చేయడానికి డబ్బులు లేవని కూర్చుంటే సరిపోదని.. ఆలోచన చేస్తే పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు అన్నారు. దేశంలోనే నంబర్-1 డెవలపర్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. సాస్కి, ప్రభుత్వ నిధులు, నాబార్డ్ వంటి వనరుల నుంచి వచ్చే నిధులను సమర్థంగా వినియోగించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.
కుప్పం తరహాలో రాష్ట్రవ్యాప్తంగా సక్సెస్ స్టోరీలు
కుప్పం సమీపంలో జాతీయ రహదారికి దగ్గరగా పారిశ్రామిక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని చంద్రబాబు తెలిపారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా విజయగాథలను సృష్టించాలని అన్నారు. ‘వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్’ విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే అభివృద్ధి మరింత వేగంగా సాధ్యమవుతుందని చెప్పారు. అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రజల ఆలోచనా విధానం మారాలని, అందుకు అనుగుణంగా పబ్లిక్ పాలసీలను రూపొందించాలని సూచించారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఫోకస్
రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు వేగంగా ఏర్పాటయ్యేలా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను మరింత మెరుగుపరచాలని చంద్రబాబు అన్నారు. ప్రజలకు ఇబ్బందిగా ఉన్న అంశాలను నాయకులు గుర్తించి, వాటికి తగిన పరిష్కారాలను సూచించాలని సూచించారు. ప్రతి ప్రాంతంలోని అవకాశాలను గుర్తించి, వాటిని అభివృద్ధిగా మార్చగలిగితే రాష్ట్రాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
-
Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!