Madanapalle Sub Collector Office incident: ఆంధ్రప్రదేశ్‌లో మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన సంచలనం సృష్టించింది.. అయితే, ఇది అగ్నిప్రమాదం కాదని.. ఉద్దేశ్యపూర్వకంగానే కీలక దస్త్రాల్ని కాల్చివేశారని పోలీసులు తేల్చారు.. దీనిపై విచారణ సాగుతూ వస్తున్న తరుణంలో.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనను సీఐడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు, మూడు రోజుల్లో దీనిపై ఉత్తర్వులు జారీ చేయనుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.. మదనపల్లి ఫైల్స్ ఘటనలో రోజు రోజుకూ కొత్త అంశాలు వెలుగులోకి వస్తుండడంతో సీఐడీ అయితేనే మేలని భావిస్తోంది సర్కార్.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉండడంతో సీఐడీకి మదనపల్లి ఫైల్స్ కేసు బదలాయించాలనే నిర్ణయానికి వచ్చింది..
Read Also: NTR Bharosa Pensions: రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ.. 2.30 గంటల్లోనే..!
ఇక, ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహించారు.. సీఎం ఆదేశాలతో డీజీపీ సహా కీలక అధికారులు రంగంలోకి దిగారు.. ఇక, తాజాగా బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఈ కేసులో భూ సంబంధిత బాధితులందరికీ న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎవరికీ అన్యాయం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో కుట్రకోణం, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు పెద్దల ప్రమేయానికి సంబంధించిన అంశాలన్నీ ముడిపడి ఉన్న నేపథ్యంలో.. తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు..
Read Also: UPI Payments: దేశంలో నిలిచిపోయిన యూపీఐ సేవలు.. కారణం ఏంటంటే?
కాగా, అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో కొందరు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే.. పాత ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ను సస్పెండ్ చేసింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రమాదం కాదని.. కుట్రలో భాగంగానే ఫైళ్లను తగులబెట్టారని అధికారులు తెలిపారు. ఫైళ్లపై ఏదో కెమికల్ చల్లారు.. కెమికల్ చల్లకుండా ఇంత పెద్ద ఎత్తున ఫైళ్లు త్వరగా దగ్దం కావని అంటున్నారు.. మదనపల్లె ఫైల్స్ ఘటనలో కేవలం 17 నిమిషాల్లో ఫైళ్లన్నీ దగ్దం అయ్యాయని పేర్కొన్నారని అధికారులు చెబుతున్నారు.